Andhra Pradesh: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ప్రాక్టికల్ పరీక్షలు వచ్చే నెలలోనే!
- ప్రభుత్వానికి ఇంటర్ విద్యామండలి ప్రతిపాదనలు
- త్వరలో కొత్త షెడ్యూల్ విడుదల చేయనున్న అధికారులు
- విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ మారనుంది. థియరీ పరీక్షలకన్నా ముందే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. ప్రభుత్వ ఆమోదం పొందగానే కొత్త షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు చెప్పారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇంటర్ విద్యార్థులకు ముందు థియరీ పరీక్షలు జరిగేవి, ఆ తర్వాతే ప్రాక్టికల్ పరీక్షలను అధికారులు నిర్వహించేవారు. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి మే 10 వరకు 2 విడతలుగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలయింది. అయితే, ఈ షెడ్యూల్ వల్ల ఎంసెట్ సహా ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సమయం సరిపోదని విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ మార్చాలంటూ కాలేజీల యాజమాన్యాలు ఇంటర్ విద్యామండలికి లేఖలు రాశాయి. దీనిపై స్పందించిన విద్యామండలి.. ఫిబ్రవరిలోనే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కాగా, ఏపీలో మార్చి 15 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, మార్చి 16 నుంచి సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 3న ముగియనుండగా.. సెకండియర్ పరీక్షలు ఏప్రిల్ 4న పూర్తవుతాయి.