Kamal Haasan: రైతులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు: కామారెడ్డి జిల్లా కలెక్టర్
- ఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్ ఇంకా ఫైనలైజ్ కాలేదన్న కలెక్టర్
- ఇంకా ముసాయిదా దశలోనే ఉందని వివరణ
- జోన్ ప్రకటించినంత మాత్రాన భూసేకరణ జరగదని వ్యాఖ్య
కామారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ తీసుకొచ్చిన మాస్టర్ ప్లాన్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ మాట్లాడుతూ, మాస్టర్ ప్లాన్ ఇంకా ఫైనల్ కాలేదని చెప్పారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా దశలోనే ఉందని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... రైతుల ప్రతి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తమ భూములు పోతాయని రైతులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. ఇండస్ట్రియల్ జోన్ ప్రకటించినంత మాత్రాన భూసేకరణ జరగదని అన్నారు. రైతుల నుంచి జనవరి 11 వరకు అభ్యర్థనల స్వీకరణ ఉంటుందని చెప్పారు. భూములు పోతాయని కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దని అన్నారు. పాత మాస్టర్ ప్లాన్ లో ఉన్న భూములు పోలేదు కదా? అని చెప్పారు. ఆందోళనల పేరిట ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.