china: చైనాలో రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి.. 22 మందికి గాయాలు
- శనివారం అర్ధరాత్రి దాటాక ఘటన
- దట్టంగా కురుస్తున్న పొగమంచు వల్లేనని అధికారుల అంచనా
- ముందున్న వాహనాలు దగ్గరికి వచ్చేదాకా కనిపించడంలేదని వెల్లడి
- ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై విచారణ జరుపుతున్నట్లు వివరణ
చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున జియాంగ్సి ప్రావిన్స్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు వల్ల ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో పలు వాహనాలు ఢీ కొన్నాయి. దీంతో 17 మంది ప్రాణాలు కోల్పోగా మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై విచారణ జరుపుతున్నట్లు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ప్రమాదం విషయం తెలియగానే నాన్ చాంగ్ కౌంటీ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు పలు మార్గదర్శకాలు సూచించారు. పొగమంచు వల్ల ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించడంలేదని, వాహనాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు. ముందు ప్రయాణిస్తున్న వాహనానికి తగినంత దూరంలో ఉండాలని హెచ్చరించారు. లైన్ మారడం, ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించవద్దని సూచించారు.
దట్టమైన పొగమంచు వల్ల రోడ్డు సరిగా కనిపించక ప్రమాదాలు చోటుచేసుకోవడం చైనాలో సాధారణంగా మారింది. ఇటీవల హెనాన్ ప్రావిన్స్ లోని ఓ బ్రిడ్జిపైన సుమారు 200 వాహనాలు ఒకదానినొకటి ఢీ కొన్నాయి. దీంతో ఒకరు అక్కడికక్కడే చనిపోగా మరికొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. పొగమంచు వల్ల దారి సరిగా కనిపించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు చెప్పారు.