CCTV: హైదరాబాద్ లో అడుగడుగునా సీసీటీవీ కెమెరాలు.. కానీ ఏం లాభం?
- హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 10,597 కెమెరాలు
- వీటిల్లో పనిచేయని 4,402 కెమెరాలు
- మరమ్మతులు చేయించడంలో ఆసక్తి చూపని పోలీసులు
సీసీటీవీ కెమెరాల నిఘా విషయంలో హైదరాబాద్ నగరానికి ప్రత్యేకత ఉంది. ఎన్నో నేరాలకు సంబంధించిన దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీలు ఎంతో సాయపడుతున్న విషయం వాస్తవం. కానీ, ఈ సీసీటీవీ కెమెరాల నిర్వహణలో పోలీసులకు ఏ మాత్రం ఆసక్తి లేనట్టు తెలుస్తోంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఏర్పాటైన సీసీటీవీ కెమెరాల్లో దాదాపు సగానికి సగం పనిచేయడం లేదన్న విషయం బయటకు వచ్చింది.
సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలు కావాలంటూ ఎస్ క్యూ మసూద్ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకోగా, హైదరాబాద్ సిటీ పోలీసు చీఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ నుంచి వివరాలు అందాయి. ఈ వివరాలను మసూద్ మీడియాతో పంచుకున్నారు. హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో మొత్తం 10,597 కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో ప్రస్తుతం 4,402 పని చేయడం లేదు.
ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో సీసీటీవీ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అనే వ్యవస్థ ఉంటుంది. రోజువారీ ఆయా సీటీటీవీ కెమెరాల పనితీరును పోలీసులు పర్యవేక్షిస్తుండాలి. రోజువారీ పర్యవేక్షణ సమయంలో ఏదైనా కెమెరా పని చేయడం లేదని, విజువల్స్ రికార్డు అవ్వడం లేదని గుర్తిస్తే టెక్నీషియన్లకు చెప్పి మరమ్మతులు చేయించాలని చట్టం చెబుతోంది. అంతేకాదు ప్రతి సీసీటీవీ కెమెరాకు సంబంధించి ఫుటేజీని 30 రోజుల వరకు స్టోర్ చేయాలి.
ఈ సీసీటీవీ కెమెరాలను తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ ఎన్ ఫోర్స్ మెంట్ యాక్ట్ కింద ఏర్పాటు చేశారు. ఏవైనా పెద్ద నేరాలు చోటు చేసుకున్నప్పుడు సీసీటీవీ కెమెరాలు కీలకంగా వ్యవహరిస్తుండగా, వీటి పట్ల పోలీసుల్లో నిర్లక్ష్యం నెలకొనడం విచారకరమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ సీసీటీవీ కెమెరాలన్నింటినీ సెంట్రల్ పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి స్వయంగా డీజీపీ కూడా పర్యవేక్షిస్తుంటారు. అయినా కానీ, సగానికి సగం కెమెరాలు పనిచేయకపోవడాన్నిఎవరూ పట్టించుకుంటున్నట్టు లేదు. మరోవైపు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సీసీటీవీ నిఘా లేకపోవడం గమనించాలి.