Chandrababu: పొత్తులపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...!
- చంద్రబాబు నివాసంలో ముగిసిన భేటీ
- మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
- పొత్తులపై ప్రశ్నించిన మీడియా
- అందుకు ఇంకా సమయం ఉందన్న ఇరువురు నేతలు
- ప్రస్తుతం ప్రజాసమస్యలపై పోరాడతామని వెల్లడి
ఇవాళ చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్ రావడం రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. సమావేశం అనంతరం చంద్రబాబు, పవన్ మీడియా ముందుకు రాగా, పొత్తులపై మీడియా ప్రతినిధులు స్పందించారు. దీనికి చంద్రబాబు బదులిస్తూ, ఎన్నికలప్పుడు పొత్తులు ఉంటాయని, అందుకు ఇంకా సమయం ఉందని అన్నారు.
తాము గతంలో అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని, 2009లో టీడీపీ, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయని వెల్లడించారు. ఆ తర్వాత తాము టీఆర్ఎస్ తో విభేదించామని తెలిపారు. ఏది ఎప్పుడు చేయాలనేది రాజకీయ పార్టీలకు వ్యూహాలు ఉంటాయని, పొత్తుల అంశం కూడా అలాంటిదేనని అన్నారు. మొదట రాజకీయ పార్టీల కార్యక్రమాలు సజావుగా సాగాల్సిన అవసరం ఉందని, ఆ తర్వాతే పొత్తులు, ఎన్నికలు అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తగిన సమయం వచ్చాక అందరితో మాట్లాడతామని అన్నారు.
అనంతరం పవన్ కల్యాణ్ స్పందిస్తూ... పొత్తు గురించి ఇప్పుడే మాట్లాడడం తొందరపాటు అవుతుందని అన్నారు. ముందు ప్రజాసమస్యలపై కలిసి పోరాటం చేస్తామని, అరాచక విధానాలపై ఒకే గళం వినిపిస్తామని స్పష్టం చేశారు. ప్రజా పోరాటాలు, వీధి పోరాటాలపై సంయుక్త కార్యాచరణ ఉంటుందని తెలిపారు.