Goldman Sachs: ఇప్పుడు గోల్డ్‌మన్ సాచ్స్ వంతు.. 3,200 మంది ఉద్యోగులపై వేటు!
- ఆర్థిక అస్థిరత, పెరిగిపోతున్న ఖర్చులను తగ్గించుకునే పనిలో కంపెనీలు
- ఈ నెలలోనే ప్రారంభం కానున్న తొలగింపు ప్రక్రియ
- క్షేత్రస్థాయి ట్రేడింగ్, బ్యాంకింగ్ యూనిట్లలోని ఉద్యోగులపై ప్రభావం
ఆర్థిక అస్థిరత, పెరిగిపోతున్న ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్న కంపెనీలు ఉద్యోగులకు లే ఆఫ్‌లు ప్రకటిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో టెక్ కంపెనీలు ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగించాయి. 18 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఇటీవల అమెజాన్ ప్రకటించింది. తాజాగా, అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్, ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. దాదాపు 3,200 మంది ఉద్యోగులకు లే ఆఫ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల మధ్య నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.
కంపెనీ తాజా నిర్ణయం క్షేత్రస్థాయి ట్రేడింగ్, బ్యాంకింగ్ యూనిట్లలోని ఉద్యోగులపై పడే అవకాశం ఉందని ‘బ్లూమ్‌బర్గ్’ తెలిపింది. గోల్డ్‌మన్ సాచ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ సోలోమన్ మాట్లాడుతూ.. జనవరి తొలి అర్ధభాగం నుంచి ఉద్యోగుల తొలగింపు ఉంటుందన్నారు.