Indian generic drugs: చైనాలో భారత ఔషధాలకు ఫుల్ డిమాండ్
- ఈ ఫార్మసీల్లో భారీగా ఆర్డర్లు
- భారత్ కంపెనీలు తయారు చేసే నాలుగు ఔషధాలకు గిరాకీ
- పాక్స్ లోవిడ్, మోల్నుపిరావిర్ ను కొనుగోలు చేస్తున్న చైనీయులు
చైనీయులకు ఇప్పుడు భారత జనరిక్ ఔషధాల అవసరం ఏర్పడింది. చైనాలో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతుండడం తెలిసిందే. చైనా భూ, వాయు మార్గాలను తెరిచింది. దీంతో ఇతర దేశాలతో రాకపోకలను అనుమతించింది. విదేశాల నుంచి వచ్చిన వారికి ఇక ఎలాంటి క్వారంటైన్ అమలు చేయడం లేదు. కరోనా బారిన పడిన వారు భారత ఔషధాల కోసం ఫార్మసీలకు క్యూ కడుతున్నారు. ఈ-ఫార్మసీల్లో ఆర్డర్లు ఇస్తున్నారు. దీంతో వీటిని పోలిన నకిలీ ఔషధాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అక్కడి అధికారులు సూచిస్తున్నారు.
కరోనా నివారణకు ఫైజర్ కనుగొన్న పాక్స్ లోవిడ్ ఔషధం కోసం చైనీయులు ఎగబడుతున్నారు. కరోనా నియంత్రణకు నోటి ద్వారా తీసుకునే ఫైజర్ పాక్స్ లోవిడ్ మాత్రలను ‘బేసిక్ మెడికల్ ఇన్సూరెన్స్ జాబితాలో చేర్చలేదు’ అని చైనా నేషనల్ హెల్త్ సెక్యూరిటీ యంత్రాంగం ప్రకటించింది. కంపెనీ అధిక ధర కోట్ చేయడమే ఇందుకు కారణమని పేర్కొంది.
చైనా ఈ ఫార్మసీల్లో నాలుగు రకాల కోవిడ్ జనరిక్ ఔషధాలను విక్రయిస్తున్నారు. ప్రిమోవిర్, పాక్సిస్టా, మోల్నునాట్, మోల్నాట్రిస్.. ఇవన్నీ భారత కంపెనీలు తయారు చేసినవి. ఇందులో ప్రిమోవిర్, పాక్సిస్టా రెండూ పాక్స్ లోవిడ్ జనరిక్ రూపాలు, మిగిలిన రెండూ మోల్నిపిరావిర్ జనరిక్ మందులు. ఈ నాలుగు ఔషధాలూ భారత్ లో అత్యవసర వినియోగానికి అనుమతించినవని, చైనాలో వీటి వాడకం చట్టబద్ధం కాదని అక్కడి అధికార యంత్రాంగం హెచ్చరించింది.
ఒక్క భారత్ నుంచే మేము అందుబాటు ధరలకు, కచ్చితమైన ఫలితాలతో కూడిన ఔషధాలను పొందగలమని బీజింగ్ మెమోరియల్ ఫార్మాస్యూటికల్ హెడ్ జియోబింగ్ పేర్కొన్నారు. కానీ, ఈ డిమాండ్ ను అనుకూలంగా చేసుకుని కొన్ని కంపెనీలు నకిలీ మందులను తయారు చేస్తున్నాయని, అవి రోగులపై దుష్ప్రభావాలు చూపిస్తున్నాయని తెలిపారు.