Kidney stones: కిడ్నీలో రాళ్లున్నదీ, లేనిదీ? ఇలా తెలుసుకోవచ్చు..!

Kidney stones Warning signs and symptoms reasons treatment

  • తక్కువ నీరు తాగే వారికి, ఉప్పు ఎక్కువ తీసుకునే వారికి ముప్పు
  • చిన్న రాళ్లు అయితే మూత్రం ద్వారా వెళ్లిపోతాయి
  • పెద్ద పరిమాణంలో ఉంటే వెళ్లలేక సమస్యలకు కారణమవుతాయి 

కిడ్నీలో రాళ్లు అందరికీ కాదు కానీ, కొందరిలో ఏర్పడుతుంటాయి. ఇందుకు వారి అలవాట్లు కూడా కారణమేనని చెప్పుకోవచ్చు. మినరల్స్, సాల్ట్స్ కలసి రాయి మాదిరిగా మూత్ర పిండాల్లో ఏర్పడేవే కిడ్నీ స్టోన్స్. ఇవి మూత్రపిండాల నుంచి మూత్రాశయంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల నొప్పి, మంట పలు రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. 

ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, అదే సమయంలో నీరు తక్కువగా తాగడం, కొన్ని రకాల ఆరోగ్య పరిస్థితులు కూడా కారణమై ఉండొచ్చు. రాయి పరిమాణం పెద్దగా ఉన్నప్పుడు భరించలేని నొప్పి వస్తుంది. ఇతర జీవనశైలి వ్యాధుల మాదిరిగా వీటిని కూడా నివారించొచ్చు. సరైన ఆహారం తీసుకోవడం, సరిపడా నీరు తాగడంతోపాటు చురుకైన జీవనశైలి వీటి విషయంలో సహాయకారిగా ఉంటాయి. 

కిడ్నీలో చాలా వరకు రాళ్ల పరిమాణం చాలా చిన్నగానే ఉంటుంది. దీంతో అవి మూత్రంతోపాటు బయటకు వెళ్లిపోతాయి. కానీ, వీటి పరిమాణం పెద్దగా ఉంటే మూత్రాశయ మార్గం ద్వారా బయటకు వెళ్లలేవు. అప్పుడు మనకు సమస్య ఏర్పడుతుంది. కిడ్నీల్లో ఎక్కువగా కనిపించేవి క్యాల్షియం స్టోన్స్. 

ఎలా గుర్తించొచ్చు? 
కిడ్నీలో రాళ్లున్న ప్రతి ఒక్కరికీ లక్షణాలు కనిపించాలని ఏమీ లేదు. ఈ రాళ్లు మూత్రపిండాల్లో అటూ ఇటూ కదులుతున్నప్పుడు.. మూత్రపిండాల నుంచి మూత్రాశయాన్ని కనెక్ట్ చేసే మూత్రనాళంలోకి ప్రవేశించినప్పుడే లక్షణాలు కనిపిస్తాయి. చిన్న రాళ్లు అయితే ఎలాంటి నొప్పి తెలియకుండా బయటకు వెళ్లిపోతాయి. పెద్ద రాళ్లు అయితే అవి మధ్యలో ఇరుక్కుపోయి నొప్పికి కారణమవుతాయి. పొట్ట భాగంలో చాలా చురుకైన నొప్పి వస్తుంటే అది రాళ్లకు సంబంధించినదే అయి ఉంటుంది. ఒక పక్కకు లేదంటే వెనుక వైపునకు నొప్పి వస్తుంది. ఎంత వేగంగా వస్తుందో, అంతే వేగంగా నొప్పి తగ్గిపోతుంది. 

మూత్రం రంగు కూడా మారిపోతుంది. మూత్రం ఎరుపు రంగులో కనిపించొచ్చు. ఇది రక్తస్రావానికి సంకేతం. జ్వరం, చలి, వికారం, వాంతులు కనిపిస్తాయి. మధ్యలో ఇరుక్కుపోయిన రాయి పెద్దది అయితే అప్పుడు పొట్ట వెనుక భాగంలో, పక్క భాగంలోనూ తీవ్రమైన నొప్పి వస్తుంది. వైద్యుల సాయంతో రాళ్లను తొలగించుకోవడమే పరిష్కారం. లేదంటే దీర్ఘకాలంలో మూత్ర పిండాలు దెబ్బతింటాయి.

కారణాలు..?
పెద్దలకనే కాకుండా పిల్లల్లోనూ కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవచ్చు. స్థూలకాయం, జీవక్రియల సమస్యలు, మధుమేహం, ఆహారం, నీటి పరిమాణం కిడ్నీ రాళ్లకు కారణమవుతాయి. ప్రధానంగా అధిక ఉప్పు వినియోగిస్తూ, నీరు తగినంత తీసుకోని వారికి ఇవి వస్తుంటాయి. 

చికిత్సలు
సమస్య చిన్నగా ఉంటే వైద్యులు ఆల్ఫా బ్లాకర్ ఔషధాలను సూచిస్తారు. దీంతో రాళ్లు మూత్రం ద్వారా వెళ్లిపోతాయి. రాళ్ల పరిమాణం పెద్దగా ఉండి, మూత్ర విసర్జనకు ఆటంకంగా మారితే సర్జరీ ఒక్కటే పరిష్కారం.

  • Loading...

More Telugu News