Air India: ప్రయాణికుడి వికృత చేష్టల నేపథ్యంలో ఎయిరిండియాకు డీజీసీఏ నోటీసులు
- ఎయిరిండియా విమానాల్లో ఇటీవల రెండు ఘటనలు
- న్యూయార్క్-ఢిల్లీ విమానంలో వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి
- పారిస్-ఢిల్లీ విమానంలోనూ ఇదే తరహాలో ఘటన
- తీవ్రంగా పరిగణిస్తున్న డీజీసీఏ
ఇటీవల ఎయిరిండియా విమానాల్లో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన ఘటనలు రెండు జరిగాయి. న్యూయార్క్-ఢిల్లీ విమానంలో వెల్స్ ఫార్గో సంస్థ ఉపాధ్యక్షుడు శంకర్ మిశ్రా మద్యం మత్తులో ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేయడం తెలిసిందే. ఇది జరిగిన పది రోజుల తర్వాత ప్యారిస్ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిరిండియా విమానంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మద్యం మత్తులో అతడు కూడా తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు.
ఈ ఘటనను డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ ప్రయాణికుడి దుశ్చర్యపై ఎయిరిండియాకు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని స్పష్టం చేసింది. తాము స్వయంగా అడిగేంత వరకు ఈ విషయంపై ఎయిరిండియా తమకు నివేదించకపోవడాన్ని డీజీసీఏ తప్పుబట్టింది.
అంతేకాదు, విమానంలో అనుచిత ప్రవర్తనకు పాల్పడే ప్రయాణికుల పట్ల అనుసరించాల్సిన విధివిధానాలను కూడా ఎయిరిండియా పాటించలేదని గుర్తించింది. ఈ ఘటనపై ఆలస్యంగా స్పందించడమే కాకుండా, సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని డీజీసీఏ తన నోటీసుల్లో ఆక్షేపించింది.
న్యూయార్క్-ఢిల్లీ విమాన ఘటనకు సంబంధించి డీజీసీఏ ఈ నెల 5న నోటీసులు జారీ చేసింది. నాలుగు రోజుల వ్యవధిలో తాజా నోటీసులు జారీ చేసింది.