Jaspreet Bumrah: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ కు బుమ్రా దూరం

Bumrah out of action from ODI series with Sri Lanka
  • గాయంతో విశ్రాంతి తీసుకుంటున్న బుమ్రా
  • పూర్తిగా కోలుకోని వైనం
  • ఎన్సీయేలో సాధన చేస్తున్న బుమ్రా
  • బుమ్రా స్థానంలో ఎవరినీ ఎంపిక చేయడంలేదన్న బోర్డు
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకతో వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. రేపటి నుంచి టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. గాయం కారణంగా శ్రీలంకతో టీ20 సిరీస్ కు దూరమైన బుమ్రా తొలి వన్డే సమయానికి జట్టులో చేరాల్సి ఉంది. 

అయితే అతడు పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం విశ్రాంతి అవసరమని బోర్డు భావిస్తోంది. బుమ్రా బౌలింగ్ లో లయను దొరకబుచ్చుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుందని, ముందు జాగ్రత్తగా అతడిని వన్డే సిరీస్ నుంచి తప్పిస్తున్నట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. బుమ్రా స్థానంలో ఎవరినీ ఎంపిక చేయడంలేదని తెలిపింది. 

ప్రస్తుతం బుమ్రా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే)లో సాధన చేస్తున్నాడు. అయితే వీపు భాగంలో పట్టేసినట్టుగా ఉంటోందని చెప్పడంతో ఎన్సీయే వైద్య నిపుణుల బృందం అతడి సమస్యను పరిశీలిస్తోంది. 

కాగా, శ్రీలంకతో టీ20 సిరీస్ కు విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వన్డే సిరీస్ కోసం మళ్లీ జట్టులోకి వచ్చారు.

శ్రీలంకతో వన్డే సిరీస్ కు టీమిండియా ఇదే...

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్.
Jaspreet Bumrah
Team India
ODI Series
Sri Lanka
BCCI

More Telugu News