Ponguleti Srinivas Reddy: ఢిల్లీలోనో, అమెరికాలోనో దొంగచాటుగా కండువా కప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు: పొంగులేటి
- ఖమ్మంలో 2.50 లక్షల మంది సమక్షంలో కండువా కప్పుకుంటానని పొంగులేటి స్పష్టీకరణ
- మీడియా ప్రచారంపై ఎద్దేవా
- ఏమీ లేకుండానే మీడియా ప్రచారం చేస్తోందని విమర్శ
తాను బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలపై ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ను వీడుతున్నదీ, లేనిదీ స్పష్టంగా చెప్పకున్నప్పటికీ.. తాను దొంగచాటుగా మాత్రం ఆ పని చేయబోనని పేర్కొన్నారు. ఢిల్లీలోనో, అమెరికాలోనో దొంగచాటుగా కండువా కప్పుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఖమ్మం నడిబొడ్డున 2.50 లక్షల మంది అభిమానుల సమక్షంలో కండువా కప్పుకుంటానని స్పష్టం చేశారు.
ఇక మీడియా తీరు ‘ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ఏమీ లేకుండానే తాను బీఆర్ఎస్ను వీడుతున్నట్టు మీడియా ప్రచారం చేస్తోందని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో నిన్న విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
కాగా, పొంగులేటి బీజేపీలో చేరిక దాదాపు ఖాయమైపోయిందని తెలుస్తోంది. ఈ నెల 18న అమిత్‌షాతో పొంగులేటి భేటీ కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరుతారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన తన సహచరులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు.