USA: అమెరికన్లను వీడని బాంబ్ సైక్లోన్ కష్టాలు.. వీడియో ఇదిగో!
- కాలిఫోర్నియాలో 14 మంది మృతి
- వర్షాలకు జలమయమైన వీధులు
- విరిగిపడిన చెట్లు, కొట్టుకుపోయిన రోడ్లు, అంధకారంలో ఇళ్లు
- నగరాలలోంచి జనాలను తరలిస్తున్న అధికారులు
అమెరికా ప్రజలను బాంబ్ సైక్లోన్ కష్టాలు ఇంకా వీడట్లేదు. మొన్నటి వరకు మంచు ముంచెత్తగా.. నేడు కాలిఫోర్నియాలో వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలోని పలు నగరాల రోడ్లను వరదలు ముంచెత్తుతున్నాయి. కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకుపోగా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలో సుమారు 25 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను ధాటికి సోమవారం నాటికి 14 మంది చనిపోయారని అధికారులు తెలిపారు.
సముద్ర తీర ప్రాంతంలోని మాంటెసిటో నగరం మొత్తాన్నీ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. కాలిఫోర్నియాలోని 17 రీజియన్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పలు జిల్లాల్లోని స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. శాక్రమెంటో ఏరియాలో భారీ వృక్షాలు కూలి విద్యుత్ తీగలపైన పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సెంట్రల్ కాలిఫోర్నియాలో ఐదేళ్ల పిల్లాడు వరద నీటిలో గల్లంతయ్యాడు. రెస్క్యూ సిబ్బంది దాదాపు ఏడు గంటల పాటు గాలించినా ఫలితం లేకుండా పోయింది.