Supreme Court: బలవంతపు మత మార్పిడులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- ఇది తీవ్రమైన సమస్య అన్న సుప్రీం ధర్మాసనం
- దీనికి రాజకీయ రంగు పులమొద్దని వ్యాఖ్య
- ఈ విషయంలో అటార్నీ జనరల్ సాయం కోరిన ధర్మాసనం
బలవంతపు మత మార్పిడులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మత మార్పిడి అనేది రాజకీయ రంగు పులుముకోకూడని తీవ్రమైన సమస్య అని గమనించింది. మోసపూరిత మత మార్పిడులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకునేలా కేంద్రానికి, రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని దాఖలైన పిటిషన్‌పై భారత అటార్నీ జనరల్ సాయాన్ని కోరింది.
బెదిరించి, మోసపూరిత చర్యలు, ఆర్థిక బహుమతులు, ఇతర ప్రయోజనాలతో ప్రలోభపెట్టడం ద్వారా జరిపే మత మార్పిడులకు చెక్ పెట్టాలని దాఖలైన పిటిషన్ ను జస్టిస్ ఎమ్‌ఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన బెంచ్ విచారిస్తోంది. న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ ఈ పిటిషన్ వేశారు. పిటిషన్ విచారణకు హాజరు కావాలని అటర్నీ జనరల్ వెంకటరమణిని ధర్మాసనం కోరింది.
ప్రలోభపెట్టి, బలవంతంగా, ఇతర మార్గాల ద్వారా మత మార్పిడులు జరుగుతున్నట్లయితే, ఏం చేయాలి? దిద్దుబాటు చర్యలు ఏమిటి? అని ప్రశ్నించింది. విచారణ ప్రారంభంలో ఈ పిటిషన్ రాజకీయ ప్రేరేపితమైనదని తమిళనాడు తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది విల్సన్ అన్నారు. అయితే, దీనిపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది కేవలం ఒక రాష్ర్టానికి సంబంధించిన విషయం మాత్రమే కాదని, దీన్ని రాజకీయం చేయొద్దని సూచించింది. బలవంతపు మత మార్పిడులు దేశవ్యాప్త సమస్య అని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని పిటిషనర్ కోరారు. బెదిరించి, ఆర్థిక ప్రయోజనాల ఆశ చూపించి చేసే మత మార్పిడులను నియంత్రించడంపై లా కమిషన్ ఒక నివేదికను, బిల్లును రూపొందించేలా చూడాలని పిటిషనర్ కోరారు. దీనిపై ఫిబ్రవరి 7న తదుపరి విచారణ జరగనుంది.
కాగా, బలవంతపు మత మార్పిడి జాతీయ భద్రతకు ప్రమాదకరమే కాకుండా పౌరుల మత స్వేచ్ఛకు భంగం కలిగించవచ్చునని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఇలాంటి తీవ్రమైన సమస్యను పరిష్కరించడానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని, ఆ దిశగా నిజాయతీగా ప్రయత్నించాలని కోరింది. మోసం, ప్రలోభాలు, బెదిరింపుల ద్వారా మతమార్పిడిని ఆపకపోతే చాలా క్లిష్ట పరిస్థితి తలెత్తుతుందని కోర్టు హెచ్చరించింది.