5G services: 5జీకి ఇప్పట్లో మారకపోయినా ఏం ఫర్వాలేదు.. ఎందుకంటే..!
- 5జీ నెట్ వర్క్ కేవలం కొన్ని పట్టణాలకే పరిమితం
- సేవలు ఉన్న చోటు కూడా మెరుగైన కవరేజీ లేదు
- కాల్ డ్రాప్స్ సమస్యలు.. అధిక డేటా వినియోగం
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ సంస్థలు మన దేశంలో 5జీ సేవలను రెండు నెలల క్రితం ప్రారంభించాయి. క్రమంగా ఒక్కో పట్టణానికి అవి 5జీ సేవలను విస్తరిస్తున్నాయి. ఈ ఏడాది దీపావళికి దేశవ్యాప్తంగా అన్ని ముఖ్య పట్టణాల్లో 5జీ సేవలు అందిస్తామని రిలయన్స్ జియో గత దీపావళి సందర్భంగా ప్రకటించింది. ఎయిర్ టెల్ కూడా ఇదే ప్రణాళికతో అడుగులు వేస్తోంది. కానీ, 5జీ సేవలు ఇప్పటికే డజనుకుపైగా పట్టణాల్లో అందుబాటులోకి వచ్చినప్పటికీ 5జీ సేవలను సపోర్ట్ చేసే ఫోన్లు చాలా మంది దగ్గర లేవన్నది వాస్తవం.
చాలా మంది దగ్గర (సుమారు 90-95శాతం) ప్రస్తుతం 4జీ స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి. 5జీ కవరేజీ విస్తృతంగా, అన్ని ప్రాంతాల్లో లేదు కనుక 4జీ ఫోన్ తీసేసి 5జీ ఫోన్ కొనుగోలు చేసే ఉద్దేశ్యం చాలా మందిలో లేదు. కనుక ప్రస్తుత 4జీ వినియోగదారులు 5జీకి మారిపోవడానికి కనీసం రెండు మూడేళ్లయినా పట్టొచ్చు. నిజానికి ఇప్పుడే 5జీకి మారిపోవాల్సినంత అత్యవసరం కూడా లేదు. ఇందుకు కారణాలను చూస్తే...
- మన దేశంలో డేటా వినియోగం పెరిగిపోవడానికి ప్రధాన కారణం ధరలు దిగిరావడమే. జియో మొదట్లో ఉచితంగా ఇచ్చి తర్వాత నెలవారీ రూ.150కే అన్ లిమిటెడ్ ప్లాన్లను ఆఫర్ చేసింది. జియో దెబ్బకు ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలు కూడా అదే రేటుకు ఇవ్వాల్సి వచ్చింది. కానీ, ప్రస్తుతం నెలవారీ ప్లాన్ కోసం రూ.250-300 పెట్టాల్సి వస్తోంది. ఇప్పుడు 5జీకి మారిపోతే డేటా వినియోగం మరింత పెరిగిపోయి నెలవారీ రీచార్జ్ కూడా ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది.
- ఎందుకంటే 4జీ కంటే 5జీ డేటా వేగం కనీసం 10 రెట్లు అధికం. దీంతో క్షణాల్లోనే డేటా డౌన్ లోడ్ అయిపోతుంటుంది. మనం ఫోన్లో చూసే చాలా యాప్స్, సోషల్ మీడియా వేదికలు, పోర్టళ్లలో వీడియోలు కూడా డిఫాల్ట్ గా ప్లే అవుతుంటాయి. యాడ్స్ డిస్ ప్లే అవుతుంటాయి. గ్రాఫిక్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. 5జీ చాలా వేగం కనుక డేటా త్వరగానే ఖర్చయిపోతుంటుంది. ప్రస్తుత ప్లాన్ లో ఉన్న 1-2జీబీ రోజువారీ డేటా 5జీలో చాలకపోవచ్చు.
- ఏదైనా పెద్ద ఫైల్ ను సైజు తెలియక డౌన్ లోడ్ కోసం ఓకే చేశారంటే నిమిషంలోపే పూర్తయిపోతుంది. కనుక డేటాను పొదుపుగా వాడుకునే వారికి 5జీతో ఇబ్బందే. డైలీ డేటా లిమిట్ అయిపోతే, తర్వాత ముఖ్యమైన అవసరాలకు ఇబ్బంది ఏర్పడొచ్చు.
- 5జీ అందుబాటులోకి వచ్చిన ప్రాంతాల్లోనూ 4జీ మాదిరిగా విస్తృత కవరేజీ లేదు. కనుక కాల్ డ్రాప్స్ సమస్యలు ఎదురవుతున్నాయి.
- 5జీ ఫోన్ ఉన్నా టెలికం నెట్ వర్క్ లకు కొన్ని సపోర్ట్ చేయడం లేదు. ఈ సాంకేతిక సమస్యలను ఇంకా సరిచేయాల్సి ఉంది.
- తాము 5జీకి మారిన తర్వాత ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతోందని పలువురు గగ్గోలు పెడుతున్నారు. ఐఫోన్ యూజర్ల నుంచి కూడా ఇలాంటి అభిప్రాయం వినిపిస్తోంది. సిగ్నల్ స్ట్రెంత్ తక్కువగా ఉన్నప్పుడు బ్యాటరీ పవర్ డ్రెయిన్ అవుతుంటుంది.
- 5జీ నెట్ వర్క్ పూర్తి స్థాయిలో కుదురుకునేందుకు రెండేళ్లు అయినా పడుతుంది. అప్పటి వరకు వేచి చూడడమే బెటర్ అన్న అభిప్రాయం చాలావరకు వినిపిస్తోంది.