Supreme Court: ‘జోషిమఠ్’పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ లో భూమి కుంగుబాటు
- జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్
- దాన్ని ప్రభుత్వాలు చూసుకుంటాయని వ్యాఖ్యానించిన ధర్మాసనం
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో భూమి కుంగుబాటుకు సంబంధించిన వ్యాజ్యాన్నిఅత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఉన్నందున దేశంలో ముఖ్యమైన అంశాలన్నీ కోర్టుకు రావాల్సిన అవసరం లేదని పేర్కొంది. జోషిమఠ్ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని పిటిషనర్ కోరారు. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు ఈ వ్యాజ్యం వచ్చింది.
స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి తరఫు న్యాయవాది పరమేశ్వర్ నాథ్ మిశ్రా ఈ కేసును అత్యవసర విచారణ కోసం ప్రస్తావించారు. దీనికి కోర్టు నిరాకరించింది. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఈ విషయాలు చూసుకోగలవు అని ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 16న దీన్ని విచారణకు తీసుకుంటామని చెప్పింది. పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ కారణంగా జోషిమఠ్‌లో ఈ పరిస్థితి ఏర్పడిందని, ఉత్తరాఖండ్ ప్రజలకు తక్షణ ఆర్థిక సహాయం, నష్టపరిహారం అందించాలని సరస్వతి తన పిటిషన్లో వాదించారు. ఈ కష్ట సమయంలో జోషిమఠ్ నివాసితులకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నుంచి సాయం అందించాలని అభ్యర్థించారు.