BharatPe: నాతో కలసి ఐదేళ్లు పనిచేస్తే మెర్సెడెజ్ కారు కానుకగా ఇస్తా: అష్నీర్ గ్రోవర్
- షార్క్ ట్యాంక్ సీజన్ 1 నిర్మాత అష్నీర్ గ్రోవర్ ప్రకటన
- మూడో స్టార్టప్ ను చడీచప్పుడూ లేకుండా ప్రారంభిస్తున్నట్టు వెల్లడి
- ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచన
భారత్ పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ అంటే అందరికీ తెలియకపోవచ్చు. కానీ, షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 1 గ్రోవర్ అంటే చాలా మంది గుర్తు పడతారు. 40 ఏళ్లకే రెండు స్టార్టప్ లను విజయవంతంగా ప్రారంభించిన అష్నీర్ గ్రోవర్.. ఇప్పుడు మూడో స్టార్టప్ మొదలుపెట్టే పనిలో ఉన్నారు. భారత్ పే బోర్డు సీఈవోగా కొన్ని అవకతవకలకు పాల్పడినట్టు ఆయనతోపాటు ఆయన భార్య మాధురి జైన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో కంపెనీలో వాటాలున్నప్పటికీ, కంపెనీకి దూరమయ్యారు. దీనిపై న్యాయస్థానంలో పోరాడుతున్నారు.
షార్క్ ట్యాంక్ ఇండియా కార్యక్రమం ఏర్పాటులోనూ గ్రోవర్ పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు తాను సొంతంగా మూడో స్టార్టప్ ఆరంభిస్తున్నట్టు ప్రకటించిన ఆయన, ఆసక్తి కలిగిన వారు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. తన కొత్త ప్రాజెక్ట్ పూర్తి దేశీ విధానంతో ఉంటుందని ప్రకటించారు.
తమ కంపెనీలో భారతీయులు ఎవరైనా పెట్టుబడులు పెట్టొచ్చని గ్రోవర్ తెలిపారు. వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్లను దగ్గరకు రానివ్వబోమని తేల్చి చెప్పారు. ‘‘మార్కెట్ ను షేక్ చేసే వ్యాపారంతో మూడో స్టార్టప్ ను చడీచప్పుడూ లేకుండా ప్రారంభించే పనిలో ఉన్నాం. మేము పనులను భిన్నంగా చేస్తున్నాం.
కొత్త కంపెనీ కేవలం 50 మందితోనే ప్రారంభమవుతుంది. తదుపరి టోడు-ఫోడులో భాగం కావాలంటే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మేము ఏం ప్రారంభిస్తున్నామన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న’’ అని గ్రోవర్ ప్రకటించారు. తన కొత్త స్టార్టప్ లో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకునే ప్రతి ఒక్క ఉద్యోగికి మెర్సెడెజ్ బెంజ్ కారును కానుకగా ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు.