Cancer: కేన్సర్ ను నివారించొచ్చు.. ఎలా అంటే..!
- ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రాధాన్యం ఇవ్వాలి
- మంచి ఆహారం, శారరీక వ్యాయామాలు అలవాటు చేసుకోవాలి
- హానికారకాలు, కాలుష్య కారకాలకు దూరంగా ఉండాలి
కేన్సర్ ప్రాణం తీసే మహమ్మారి. కాకపోతే తొలి రెండు దశల్లోనే దీన్ని గుర్తించాలి. మూడు, నాలుగో దశలకు వెళ్లిందంటే ప్రాణాలకు రిస్క్ తెచ్చుకున్నట్టు అవుతుంది. ముఖ్యంగా నాలుగో దశకు మహమ్మారి విస్తరిస్తే దాన్నుంచి బయటపడడం చాలా కష్టం. అందుకే ప్రతి ఒక్కరూ కేన్సర్ ను మొగ్గలోనే తుంచి వేయాలి. ఇందుకు ఏం చేయాలి..? మధ్య వయసు దాటిన తర్వాత ఏడాది, రెండేళ్లకోసారి కేన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడం మెరుగైన మార్గం అవుతుంది.
కేన్సర్ కు తీసుకునే చికిత్సలతో ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయి. అంటే చికిత్సా సమయంలో ఎన్నో ఇబ్బందులను అధిగమించాలి. పైగా కేన్సర్ కు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందే సామర్థ్యం చాలా తక్కువ మందికే ఉంటుంది. రూ.20-50 లక్షల వరకు ఖర్చవుతుంది. అంత ఇబ్బంది రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలే మేలైన మార్గం. కేన్సర్ మహమ్మారి ఏటా ప్రపంచవ్యాప్తంగా 1.9 కోట్ల మందికి సోకుతుంటే, ఏటా కోటి మంది మరణిస్తున్నారు. వీటిల్లో 30-50 శాతం కేసుల్లో కేన్సర్ నివారించతగినవే ఉంటున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు.
వీటిల్లో మార్పులు..
కేన్సర్ ను జన్యు సంబంధ, జీవనశైలి, పర్యావరణ అంశాలు ప్రభావితం చేస్తాయి. కేన్సర్ కు దారితీసే కొన్ని రకాల రిస్క్ లను దూరం పెట్టుకోవడం ఫలితాలను ఇస్తుంది. నివారణ మెరుగైనది. రిస్క్ కు దారితీసే అంశాలలో పొగాకు అలవాటు ఒకటి. ఆల్కహాల్ రెండోది. వీటికి దూరంగా ఉంటే హెడ్ కేన్సర్, నెక్ కేన్సర్, లంగ్ కేన్సర్, లివర్ కేన్సర్, బ్లాడర్ కేన్సర్ ను నివారించొచ్చు. పొగతాగడం, మద్యం సేవించే అలవాట్లకు గుడ్ బై చెప్పాలి.
శరీర బరువు నియంత్రణ చాలా ముఖ్యమైనది. స్థూలకాయం రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులకు దారితీస్తుందని వినే ఉంటారు. స్థూలకాయం కేన్సర్ కు కూడా కారణమవుతుందన్నది వైద్యుల హెచ్చరిక. కనుక బాడీ మాస్ ఇండెక్స్ ను 18.5-24.9 మధ్య కట్టడి చేయాలి. ఆహారంలో మార్పులు చేసుకోవాలి. పండ్లు, కూరగాయలు కలిపి మూడింట రెండొంతుల పరిమాణాన్ని తీసుకోవాలి. మిగిలిన ఒక భాగం కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే రైస్ వంటి వాటికి చోటు ఇవ్వొచ్చు. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉండే ముడి ధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పీచు ఉండే పదార్థాలు మంచివి.
రోజువారీ శారీరక వ్యాయామాలు చేయాలి. శారీరక కదలికలు లోపించిన వారికి కేన్సర్ రిస్క్ పెరుగుతున్నట్టు పరిశోధకులు ఇటీవలి అధ్యయనాల్లో గుర్తించారు. సూర్యరశ్మికి ఎక్కువగా ఎక్స్ పోజ్ కాకూడదు. రోజులో అరగంట నుంచి గంట వరకు ఏమీ కాదు. కానీ, ఎక్కువ సమయం పాటు సూర్యరశ్మికి గురైతే చర్మ కేన్సర్ రిస్క్ పెరుగుతుంది. కార్సోజెనిక్ ఉండే ఆస్బెస్టాస్, క్రోమియం, క్యాడ్మియం, సిలికా దుమ్ము, సల్ఫర్ కు ఎక్స్ పోజ్ కాకూడదు. కాలుష్యంలోకి వెళ్లే సమయంలో మంచి ప్రొటెక్టివ్ మాస్క్ ధరించాలి.
కొంత మందిలో కేన్సర్ వృద్ధి చెందేందుకు అనుకూల జన్యువులు ఉంటాయి. అటువంటి జన్యువులు ఉన్న వారి నుంచి వారి పిల్లలకు కూడా బదిలీ అవుతాయి. అప్పుడు కేన్సర్ వంశపారంపర్యం అవుతుంది. ఇలాంటి వారు ముందస్తుగా స్క్రీనింగ్, జన్యు పరీక్షలు చేయించుకోవడం ద్వారా తమ రిస్క్ పై అంచనాకు రావచ్చు. మహిళలు అయితే హ్యుమన్ ప్యాపిలోమా వ్యాక్సిన్ తీసుకోవాలి. దీంతో గర్భాశయ కేన్సర్ ను నివారించొచ్చు. హెపటైటిస్ బీ వ్యాక్సిన్ తీసుకుంటే లివర్ కేన్సర్ రిస్క్ తగ్గుతుంది.