Andhra Pradesh: చిరు వ్యాపారుల కష్టాలు దగ్గరి నుంచి చూశా: 'జగనన్న తోడు' నిధుల విడుదలలో ఏపీ సీఎం జగన్
- వారి కష్టాలను తీర్చేందుకే జగనన్న తోడు పథకం తెచ్చామన్న సీఎం
- 3.95 లక్షల మంది లబ్దిదారులకు రూ.395 కోట్ల రుణాలు ఇచ్చినట్లు వెల్లడి
- ఆరు నెలలకు సంబంధించిన వడ్డీ రూ.15.17 కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో జమ
రాష్ట్రంలోని చిరు వ్యాపారుల కష్టాలను దగ్గరి నుంచి చూసి, వారి కష్టాలను తీర్చేందుకే జగనన్న తోడు పథకం తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చిరు వ్యాపారులు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వడ్డీ, గ్యారంటీ లేకుండా రూ.10 వేల రుణం అందిస్తున్నామని చెప్పారు. ఈమేరకు బుధవారం ‘జగనన్న తోడు’ పథకం నిధులను ముఖ్యమంత్రి విడుదల చేశారు.
ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ.. జగనన్న తోడు పథకం కింద 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.395 కోట్ల రుణాలు ఇచ్చినట్లు వివరించారు. ఈ రుణాలకు సంబంధించి చిరు వ్యాపారులు బ్యాంకులకు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుందని, ఆ మొత్తాన్ని వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు 15,31,347 మందికి రూ.2,406 కోట్ల వడ్డీలేని రుణాలు అందించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు.
గత ఆరునెలల వ్యవధిలో ఈ పథకం కింద ఇచ్చిన రుణాలకు సంబంధించి వడ్డీ రూ.15.17 కోట్లను రీఎంబర్స్ మెంట్ చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ మొత్తాన్ని లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. ఈ పథకానికి సంబంధించి రుణాలను సకాలంలో చెల్లించిన 13.28 లక్షల మందికి రూ. 63 కోట్లకు పైగా వడ్డీ తిరిగి చెల్లించామన్నారు. చిరువ్యాపారులు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ మెచ్చుకున్నారు. జగనన్న తోడు పథకం అందని చిరు వ్యాపారులు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు.