Devineni Avinash: దేవినేని అవినాశ్ తో సెటిల్ చేసుకోమంటున్నారు: మైనార్టీ నాయకురాలు రజిమా
- తన తల్లిపై దాడి చేశారన్న రజిమా
- వైసీపీ కోసం పని చేస్తే కళ్లలో కారం కొట్టారని మండిపాటు
- సెటిల్ చేసుకోవడానికి తామేమైనా బ్లేడ్ బ్యాచా? అని ప్రశ్న
విజయవాడ కృష్ణలంకలోని రాణిగారితోట ప్రాంతంలో ఉన్న మహిళలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వైసీపీ నేత దేవినేని అవినాశ్, స్థానిక కార్పొరేటర్ రామిరెడ్డితో కలిసి గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వారిని స్థానిక మహిళలు నిలదీశారు. మీకోసం పని చేస్తే తమను మోసం చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలో మైనార్టీ నాయకురాలు రజిమా ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. ఇంటిలోని వస్తువులను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 వరకు పీఎస్ లోనే కూర్చోబెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
దేవినేని అవినాశ్ తో సెటిల్ చేసుకోవాలని పోలీసులు చెప్పారని... ఆయనతో ఏం సెటిల్ చేసుకోవాలని ప్రశ్నించారు. సెటిల్ చేసుకోవడానికి తామేమైనా బ్లేడ్ బ్యాచా? అని ప్రశ్నించారు. తమ ఇంటిపై దాడి చేశారని, తన తల్లిని కొట్టారని, బూటు కాళ్లతో తన్నారని, కళ్లలో కారం కొట్టారని మండిపడ్డారు. వైసీపీ కోసం తాము పనిచేస్తే... ఇప్పుడు తమ కళ్లలోనే కారం కొట్టారని అన్నారు. మహిళలపై దాడి చేయాలని సీఎం జగన్ చెప్పారా? అని దుయ్యబట్టారు.