Team India: రెండో వన్డేలో టీమిండియాపై టాస్ నెగ్గిన శ్రీలంక
- కోల్ కతాలో మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
- చహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ కు స్థానం
- శ్రీలంక జట్టులో రెండు మార్పులు
టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు రెండో వన్డే జరుగుతోంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమిస్తోన్న ఈ మ్యాచ్ లో శ్రీలంక జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 8 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది.
లంక ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో 20 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. సిరాజ్ వేసిన ఇన్ కట్టర్ ను ఆడే ప్రయత్నంలో ఆవిష్క బౌల్డయ్యాడు. బంతి బ్యాట్ లోపలి అంచును తాకి వికెట్లకు తగిలింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ నువనిదు ఫెర్నాండో (12), కుశాల్ మెండిస్ (5) ఆడుతున్నారు.
కాగా ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో ఒక మార్పు చోటుచేసుకుంది. గాయపడిన లెగ్ స్పిన్నర్ చహల్ స్థానంలో రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు స్థానం కల్పించారు. ఇంక లంక జట్టులో గాయపడిన మధుశంకను తప్పించారు. వీపు నొప్పితో బాధపడుతున్న ఓపెనర్ పత్తుమ్ నిస్సాంకకు విశ్రాంతినిచ్చారు. ఈ మ్యాచ్ తో నువనిదు ఫెర్నాండో అంతర్జాతీయ అరంగేట్రం చేస్తున్నాడు. పేసర్ లహిరు కుమారకు తుదిజట్టులో స్థానం కల్పించారు.
కాగా, ఈ సిరీస్ లో తొలి వన్డేలో నెగ్గిన టీమిండియా 1-0తో ఆధిక్యంలో ఉంది. నేటి మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ వశమవుతుంది.