Makar Sankranti: నేడు, రేపు పలు ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు.. పండగ రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్‌లో 21 టికెట్ కౌంటర్లు
- సంక్రాంతికి ఊరెళ్లే వారితో రైల్వే స్టేషన్‌లో రద్దీ
- టికెట్ల కోసం కౌంటర్ల వద్ద ప్రయాణికుల పాట్లు
- అదనంగా 9 టికెట్ కౌంటర్ల ఏర్పాటు
- జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బందితో అదనపు భద్రత
సంక్రాంతి పండుగ కోసం ఊరెళ్లే వారితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోతోంది. టికెట్ల కోసం ప్రయాణికులు గంటల తరబడి కౌంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో వారి వెతలు తీర్చేందుకు రైల్వే అధికారులు అదనంగా మరికొన్ని కౌంటర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 12 కౌంటర్లు మాత్రమే ఉండగా అదనంగా మరో 9 ఏర్పాటు చేసి మొత్తం 21 కౌంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
అలాగే, టికెట్ తనిఖీ సిబ్బందిని 20 నుంచి 40 మందికి పెంచారు. రద్దీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 60 మంది ఆర్పీఎఫ్, 30 మంది జీఆర్పీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఏ రైలు ఏ సమయానికి, ఏ ప్లాట్‌ఫాంపైకి వస్తుందనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రకటించేందుకు అదనంగా సహాయకులను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.
కాగా, ఎంఎంటీఎస్ సర్వీసుల్లో కొన్నింటిని నేడు, రేపు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. లింగంపల్లి-హైదరాబాద్-లింగంపల్లి మధ్య నడిచే 5 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి-ఫలక్‌నుమా మధ్య నడిచే 11 సర్వీసులను, హైదరాబాద్-ఫలక్‌నుమా-హైదరాబాద్ మధ్య నడిచే ఒక రైలు సర్వీసును అధికారులు రద్దు చేశారు.