Pakistan: భారత్ లో విలీనం కోసం పీవోకే ప్రజల ర్యాలీలు
- 12 రోజులుగా ముమ్మరంగా కార్యక్రమాలు
- గిల్గిట్ బాల్టిస్థాన్ లో హోరెత్తిపోతున్న నిరసన ప్రదర్శనలు
- తమ ప్రాంతం పట్ల చూపిస్తున్న వివక్షను ప్రశ్నిస్తున్న ప్రజలు
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్ లో విలీనానికి మద్దతు పెరుగుతోంది. పీవోకేలోని గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రజలు తమ ప్రాంతాన్ని భారత్ లో విలీనం చేయాలనే డిమాండ్ ను మరింత బలంగా వినిపిస్తున్నారు. ఇందుకోసం వారు నిరంతరం ర్యాలీలతో పాకిస్థాన్ ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తున్నారు. తమ ప్రాంతం పట్ల పాక్ చూపిస్తున్న వివక్షను వారు ప్రశ్నిస్తున్నారు.
కార్గిల్ రోడ్డును తెరిచి భారత్ లో కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ పరిధిలోని కార్గిల్ జిల్లాలో కలపాలని కోరుతూ నిర్వహించిన భారీ ర్యాలీ వీడియోలు ట్విట్టర్ లోకి చేరాయి. ముఖ్యంగా గడిచిన 12 రోజులుగా ఆ ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు ముమ్మరంగా సాగుతున్నాయి. గోధుమ, ఇతర ఆహారోత్పత్తులపై సబ్సిడీలను పునరుద్ధరించాలని కోరుతున్నారు. పాకిస్థాన్ ఆర్మీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేస్తున్నారు.
ప్రస్తుతం పాకిస్థాన్ తన చరిత్రలోనే అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అక్కడి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడంతో, ప్రజల జీవన పరిస్థితులు మరింత దిగజరాయి. నిత్యావసరాలను కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఇవన్నీ భారత్ కు అనుకూలించేవేనని నిపుణుల అభిప్రాయం. పీవోకేను ఎప్పటికైనా చేజిక్కించుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పుడో విస్పష్టంగా చెప్పారు. కానీ, ఎప్పుడన్నది చెప్పలేదు. తగిన అనువైన సమయం కోసమే భారత సర్కారు వేచి చూస్తోంది. పాక్ ఆర్థిక పరిస్థితులు మరింత దారుణంగా మారిపోతే, అక్కడి ప్రజల మద్దతుతో, సైనిక బలంతో పీవోకేను సొంతం చేసుకోవడానికి అనుకూలతలు పెరుగుతాయి.