Sanjay Dutt: చనిపోయినా సరే.. కేన్సర్ కు చికిత్స వద్దనుకున్నా: సంజయ్ దత్
- తమ కుటుంబంలో కేన్సర్ హిస్టరీ ఉందన్న బాలీవుడ్ నటుడు
- అమ్మ, భార్య కేన్సర్ తోనే చనిపోయారని వెల్లడి
- కీమో థెరపీతో కేన్సర్ ను జయించిన సంజయ్
ప్రాణాంతక మహమ్మారి అయిన కేన్సర్ ను తొలి దశలో గుర్తించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని వింటుంటాం. ఇందుకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రత్యక్ష నిదర్శనం. ఎందుకంటే సంజయ్ దత్ కు లంగ్ కేన్సర్ ఉన్నట్టు 2020లో బయటపడింది. కీమోథెరపీ చికిత్సతో ఆయన మహమ్మారి నుంచి బయటపడ్డారు. తన అనుభవాలను ఇటీవలే ఆయన వెల్లడించారు.
‘‘నాకు వెన్ను నొప్పి వస్తుండేది. వేడి నీటి బాటిల్, నొప్పి నివారణ ఔషధాలతో చికిత్స చేశారు. కానీ, ఒక రోజు నాకు శ్వాస ఆడలేదు. వెంటనే నన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఆ సమయంలో నా వెంట భార్య, సోదరి లేదా కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. ఉన్నట్టుండి ఓ యువకుడు వచ్చి ‘మీకు కేన్సర్ ఉంది’ అని చెప్పి వెళ్లిపోయాడు. నా కండిషన్ గురించి చెప్పిన తర్వాత కీమోథెరపీ చికిత్స తీసుకోవడానికంటే చచ్చిపోవడం నయమని అనుకున్నాను.
మా కుటుంబంలో కేన్సర్ చరిత్ర ఉంది. మా అమ్మ పాంక్రియాటిక్ కేన్సర్ తో చనిపోయింది. నా భార్య (రిచా శర్మ) బ్రెయిన్ కేన్సర్ తో మరణించింది. అందుకే నాకు కేన్సర్ అని చెప్పిన వెంటనే కీమో థెరపీ తీసుకోకూడదని అనుకున్నాను. ఒకవేళ చనిపోతే చనిపోనీ కానీ, ఎలాంటి చికిత్స తీసుకోకూడదని అనుకున్నాను’’ అని సంజయ్ దత్ వెల్లడించారు.
కానీ, సంజయ్ భార్య మాన్యతాదత్, ఆయన తోబుట్టువులు ప్రియా దత్, నమ్రతా దత్ మద్దతుగా నిలవడంతో కీమో ధెరపీ తీసుకుని సంజయ్ దత్ బయటపడ్డాడు.