Uttar Pradesh: యూపీలో ఘోరం.. మతం మారనన్నందుకు భార్యను సిగరెట్లతో కాలుస్తూ, బలవంతంగా మాంసం తినిపిస్తున్న భర్త!
- లక్నోలో అమానవీయ ఘటన
- హిందువును అని చెప్పి పెళ్లి చేసుకున్న ముస్లిం వ్యక్తి
- ఇస్లాం స్వీకరించాలంటూ హింసిస్తున్నాడని భార్య ఆవేదన
మత మార్పిడికి అభ్యంతరం చెప్పడంతో భర్త తనను తరచూ కొట్టి హింసిస్తున్నాడని, సిగరెట్ పీకలతో కాల్చి, బలవంతంగా మాంసం తినేలా చేశాడని ఓ మహిళ ఆరోపించింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. భర్త చాంద్ మహ్మద్ హిందువునని చెప్పి తనను పెళ్లి చేసుకున్నాడని సదరు మహిళ ఆరోపించింది. పెళ్లి సమయంలో తన పేరును సాని మౌర్య అని చెప్పాడని వెల్లడించింది. వివాహం తర్వాత లక్నో నగరంలో అద్దెకు ఉంటున్నామని, కొన్నాళ్లుగా భర్త తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా ఇస్లాం మతాన్ని స్వీకరించాలని బలవంతం చేశాడని చెప్పింది.
తాను మతం మారనని చెప్పడంతో శారీరకంగా హింసించడం మొదలు పెట్టాడని, సిగరెట్ పీకలతో కాల్చి, వేడి నూనె పోశాడని మహిళ ఆరోపించింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని, బంధువులతో తనపై అత్యాచారం చేయిస్తానని బెదిరించాడని ఆమె వాపోయింది. ఇంటి నుంచి పారిపోయి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ భర్త తమ గదిలోకి లాక్కెళ్లి కొట్టేవాడని బాధితురాలు ఆరోపించింది. ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు కూడా చాంద్ మహ్మద్ తనను కొట్టడంతో గర్భస్రావం జరిగిందని ఆమె పేర్కొంది. వన్–స్టాప్ సెంటర్ ద్వారా రక్షణ పొందిన సదరు మహిళ తన భర్తపై పోలీసుకు ఫిర్యాదు చేయనుంది.