CI Sudhakar: అంబర్ పేట సీఐ సుధాకర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
- ఓ భూ వివాదంలో బుక్కయిన సీఐ సుధాకర్
- భూమి ఇప్పిస్తానంటూ రూ.54 లక్షలు వసూలు
- భూమి ఇప్పించకుండా, డబ్బులు తిరిగివ్వకుండా వేధించారన్న ఎన్నారై
- వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాదులోని అంబర్ పేట సీఐ సుధాకర్ ను వనస్థలిపురం పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. ఓ భూ వివాదంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఓ ఎన్నారైని మోసం చేశారన్న ఫిర్యాదుపై వనస్థలిపురం పోలీసులు సీఐ సుధాకర్ పై చర్యలకు ఉపక్రమించారు. మహేశ్వరంలో ల్యాండ్ ఇప్పిస్తానంటూ సీఐ సుధాకర్ రూ.54 లక్షల మేర వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.
నాలుగు రోజుల కిందట సదరు ఎన్నారై వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా, పూర్తిస్థాయిలో విచారణ జరిపిన పోలీసులు సీఐని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అతడిని రిమాండ్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాను చెప్పిన ప్రదేశంలో భూమిని కొంటే, భవిష్యత్తులో దాని విలువ మరింత పెరుగుతుందని సీఐ ఆ ఎన్నారైని ఒత్తిడి చేసినట్టు తెలిసింది. ఓ నకిలీ ఎమ్మార్వోను రంగంలోకి దింపి, అతడు త్వరలోనే ఆర్డీవో అవుతాడంటూ ఆ ఎన్నారైకి నమ్మకం కలిగించేందుకు ప్రయత్నించినట్టు వెల్లడైంది. రూ.54 లక్షలు తీసుకున్న తర్వాత, సీఐ తదితరులు మొహం చాటేశారని, భూమి ఇప్పించకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా వేధించారని ఆ ఎన్నారై తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.