India: హాకీ వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం
- భారత్ లో హాకీ వరల్డ్ కప్
- ఒడిశాలోని రూర్కెలాలో నేడు మ్యాచ్
- స్పెయిన్ పై 2-0తో గెలిచిన భారత్
- ప్రథమార్థంలోనే 2 గోల్స్ కొట్టి ఆధిక్యంలోకి వెళ్లిన ఆతిథ్యజట్టు
సొంతగడ్డపై జరుగుతున్న హాకీ వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం చేసింది. అగ్రశ్రేణి యూరప్ జట్టు స్పెయిన్ తో ఒడిశాలోని రూర్కెలాలో జరిగిన ప్రారంభ మ్యాచ్ లో భారత్ 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ప్రథమార్థం ముగిసేసరికి రెండు గోల్స్ కొట్టి భారత్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. స్పెయిన్ రక్షణ పంక్తిలోని లోపాలను భారత ఫార్వార్డ్ లు సద్వినియోగం చేసుకున్నారు. అమిత్ రోహిదాస్, హార్దిక్ సింగ్ భారత్ తరఫున గోల్స్ నమోదు చేశారు.
ఇక ద్వితీయార్థంలో భారత్ మరో గోల్ కొట్టకపోయినా, స్పెయిన్ దాడులను సమర్థంగా కాచుకుంది. స్కోరును సమం చేసేందుకు స్పెయిన్ స్ట్రయికర్లు విఫలయత్నాలు చేశారు. భారత్ గోల్ కీపర్ పాఠక్ స్పానిష్ ఆటగాళ్లకు అడ్డుగోడలా నిలిచాడు.
చివర్లో భారత ఆటగాడు అభిషేక్ మైదానాన్ని వీడడంతో ఆతిథ్య జట్టు 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. అయినప్పటికీ స్పెయిన్ ను సమర్థంగా నిలువరించి వరల్డ్ కప్ లో బోణీ కొట్టింది. భారత్ తన తదుపరి మ్యాచ్ ను ఈ నెల 15న ఇంగ్లండ్ తో ఆడనుంది.