Sania Mirza: రిటైర్మెంట్ పై అధికారిక ప్రకటన చేసిన సానియా మీర్జా
- దుబాయ్ ఓపెన్ తో టెన్నిస్ కు వీడ్కోలు
- ఆస్ట్రేలియన్ ఓపెన్ లోనూ ఆడతానని ప్రకటన
- 20 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్ పై సానియా సంతృప్తి
అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లు లేక భారత టెన్నిస్ రంగం వెలవెలపోతున్న తరుణంలో రంగప్రవేశం చేసిన హైదరాబాదీ క్రీడాకారిణి సానియా మీర్జా అపురూప విజయాలతో తన కెరీర్ ను సార్థకం చేసుకుంది. తన సుదీర్ఘ కెరీర్ కు ముగింపు పలుకుతున్నట్టు ఇటీవలే సంకేతాలు ఇచ్చిన సానియా... రిటైర్మెంట్ పై తాజాగా అధికారిక ప్రకటన చేసింది.
2005లో తన గ్రాండ్ స్లామ్ కెరీర్ ప్రారంభమైంది ఆస్ట్రేలియన్ ఓపెన్ తోనే అని, అందుకే ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడతానని, ఆ తర్వాత ఫిబ్రవరి 1 నుంచి జరిగే దుబాయ్ ఓపెన్ తో తన కెరీర్ కు ముగింపు పలుకుతున్నానని సానియా తన ప్రకటనలో వెల్లడించింది.
30 ఏళ్ల కిందట తల్లితో కలిసి నిజాం క్లబ్ లో టెన్నిస్ నేర్చుకునేందుకు ఓ పాప వెళ్లిందని, కానీ ఇంత చిన్న వయసులో టెన్నిస్ ఎలా నేర్చుకుంటావని అక్కడి కోచ్ అన్నాడని సానియా గుర్తుచేసుకుంది. ఆరేళ్ల వయసు నుంచే కలలను సాకారం చేసుకునేందుకు ఆ పాప పోరాటం మొదలుపెట్టిందని వివరించింది.
సమస్యలు, ఇబ్బందులు, అనేక కష్టాలను ఎదుర్కొని 50 గ్రాండ్ స్లామ్స్ ఆడానని, కొన్ని టైటిళ్లు కూడా గెలిచానని సానియా వెల్లడించింది. అయితే, పోడియంపై త్రివర్ణ పతాకంతో నిలబడడాన్ని అత్యుత్తమ గౌరవంగా భావిస్తానని సానియా తన దేశభక్తిని చాటింది. 20 ఏళ్ల తన ప్రొఫెషనల్ కెరీర్ లో కుటుంబం ఎంతో అండగా నిలిచిందని పేర్కొంది. ఇక కొత్త జీవితం ప్రారంభిస్తానని, తన కుమారుడి కోసం అత్యధిక సమయం కేటాయిస్తానని తెలిపింది.
సుదీర్ఘ కెరీర్ లో అండగా నిలిచిన తల్లిదండ్రులు, సోదరి, నా కుటుంబం, కోచ్ లు, ఫిజియోలు, ట్రైనర్లు, నా అభిమానులు, నా మద్దతుదారులు, టెన్నిస్ కోర్టులో నా భాగస్వాములు వీళ్లందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొంది. వీళ్ల సహకారం లేనిదే తాను సాధించిన ఘనతల్లో ఏ ఒక్కటీ సాధ్యమయ్యేది కాదని సానియా వినమ్రంగా అంగీకరించింది.