China: ఎట్టకేలకు కరోనా గణాంకాలు వెల్లడించిన చైనా
- చైనాలో కఠిన లాక్ డౌన్లు ఎత్తివేత
- దేశంలో ఆంక్షల సడలింపు
- ఒక్కసారిగా విజృంభించిన కరోనా వైరస్
- వేలాదిగా మరణాలు
- చైనా సమాచారాన్ని దాచిపెడుతోందంటూ విమర్శలు
ఇటీవలే కరోనా ఆంక్షలు సడలించిన చైనా ఒక్కసారిగా పాజిటివ్ కేసులు వెల్లువెత్తడం, వేల మరణాలతో ఉక్కిరిబిక్కిరైంది. అయితే ఆ గణాంకాలు ఇన్నాళ్లు దాచిపెట్టిన చైనా, ఎట్టకేలకు వాస్తవాలు వెల్లడించింది. గత డిసెంబరు 8 నుంచి ఈ నెల 12 వరకు 60 వేల మంది కరోనాతో మరణించినట్టు తెలిపింది. అయితే మరణించినవారిలో అత్యధికులు 65 ఏళ్లకు పైబడినవారేనని, మృతుల్లో 90 శాతం మంది వృద్ధులేనని వెల్లడించింది. 54,435 మంది కరోనాతో పాటు ఇతర అనారోగ్య కారణాల వల్ల కన్నుమూశారని చైనా వివరించింది. ఈ వివరాలతో చైనా నేషనల్ హెల్త్ కమిషన్ నివేదిక విడుదల చేసింది.
అటు, చైనాలోని పెకింగ్ వర్సిటీ జనవరి 11 నాటికి దేశంలో 90 కోట్ల కరోనా కేసులు నమోదైనట్టు వెల్లడించింది. గాన్సు ప్రావిన్స్ లో కరోనా విలయతాండవం చేసిందని, ఇక్కడి ప్రజల్లో 91 శాతం మంది కరోనా వైరస్ బారినపడ్డారని తెలిపింది.
కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి చైనా కఠిన లాక్ డౌన్లతో నెట్టుకొచ్చింది. ప్రజల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం కావడంతో గత డిసెంబరులో ఆంక్షలు ఎత్తివేశారు. దాంతో ఒక్కసారిగా కరోనా విజృంభించి వేల మరణాలు సంభవించాయి. అయితే చైనా మాత్రం కేవలం శ్వాసకోశ సమస్యలతో మరణించినవారినే కరోనా మృతులుగా పరిగణిస్తూ, ఈ నెల 8న చేసిన ప్రకటనలో కేవలం 5,272 మందినే గణాంకాల్లో చూపింది.
చైనా తీరు పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతకుముందే అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనాకు సంబంధించిన పరిస్థితులపై స్పష్టమైన సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకోవాలని చైనాకు స్పష్టం చేసింది.