Daggubati Venkateswara Rao: దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్‌బై!

Daggubati Venkateswara Rao And His Son Retires From Politics

  • ఇంకొల్లులో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు వెంకటేశ్వరరావు
  • ఒకప్పటి రాజకీయాలకు, ఇప్పటి రాజకీయాలకు ఎంతో తేడా ఉందన్న మాజీ మంత్రి
  • డబ్బుతో రాజకీయం చేయడం, కక్ష సాధింపులకు దిగడం తమకు తెలియవన్న మాజీ మంత్రి
  • తాను, తన కుమారుడు హితేష్ ఇద్దరం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన

దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతున్నట్టు ప్రకటించారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. తాను, తన కుమారుడు హితేష్ చెంచురామ్ ఇద్దరం రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు.

ఇంకొల్లుతో తనకు ఎంతో అనుబంధం ఉందని, అందుకనే తన మనసులోని మాటను ఇక్కడ బయటపెట్టినట్టు చెప్పారు. ఒకప్పటి రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలకు ఏమాత్రం పొంతన లేదన్న వెంకటేశ్వరరావు డబ్బుతో రాజకీయం, కక్ష సాధింపులకు దిగడం తమ కుటుంబానికి అలవాటు లేదన్నారు. అందుకనే రాజకీయాలకు తాము పూర్తిగా స్వస్తి చెబుతున్నట్టు వివరించారు.

ఎన్టీఆర్ పెద్దల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాజీ మంత్రి కూడా. పర్చూరు నుంచి అసెంబ్లీకి పలుమార్లు ప్రాతినిధ్యం వహించారు. అలాగే, లోక్‌సభ, రాజ్యసభకు కూడా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి పర్చూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆయన భార్య దగ్గుబాటి పురందేశ్వరి కేంద్రమాజీ మంత్రి. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.

  • Loading...

More Telugu News