Vande Bharat: వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
- తెలుగు ప్రజలకు ఈ ట్రైన్ సంక్రాంతి కానుక అన్న పీఎం
- ఢిల్లీ నుంచి వర్చువల్ గా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని
- సికింద్రాబాద్ లో జరిగిన కార్యక్రమానికి కేంద్ర మంత్రుల హాజరు
తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును అందించామని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పేర్కొన్నారు. మారుతున్న దేశ భవిష్యత్తుకు ఈ ట్రైన్ ఉదాహరణగా నిలుస్తుందని ప్రధాని చెప్పారు. ఈమేరకు ఆదివారం ఉదయం సికింద్రాబాద్ - విశాఖపట్నం నగరాల మధ్య వందే భారత్ ట్రైన్ ను మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని ఢిల్లీ నుంచి వర్చువల్ గా పాల్గొన్నారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు.
ఏపీ, తెలంగాణల మధ్య ఇకపై వేగవంతమైన ప్రయాణం కొనసాగుతుందని మోదీ చెప్పారు. విలువైన సమయాన్ని ఆదా చేయడానికి వందే భారత్ ఎక్స్ ప్రెస్ తోడ్పడుతుందని తెలిపారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను మన దేశంలోనే తయారు చేశామని, ఇప్పుడు ప్రారంభించిన ట్రైన్ దేశంలో ఎనిమిదవదని చెప్పారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్, గవర్నర్ తమిళి సై, తెలంగాణ మంత్రులు తలసాని, మహమూద్ అలీ హాజరయ్యారు. కాగా, సోమవారం నుంచి వందే భారత్ ట్రైన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని రైల్వే అధికారులు చెప్పారు. ఆదివారం మినహా వారంలో మిగతా ఆరు రోజులు విశాఖ-సికింద్రాబాద్ ల మధ్య ఈ వందే భారత్ ట్రైన్ నడుస్తుందని చెప్పారు.