balayya: దేవబ్రాహ్మణులకు బాలకృష్ణ క్షమాపణలు
- ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచన లేదన్న హీరో
- తనకు అందిన సమాచారం తప్పని చెప్పిన బాలయ్య
- వాస్తవం తెలియజెప్పిన పెద్దలకు కృతజ్ఞతలంటూ ప్రెస్ నోట్ విడుదల
వీరసింహారెడ్డి సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో తాను చేసిన వ్యాఖ్యలకు దేవ బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసి చాలా బాధపడ్డానని హీరో బాలకృష్ణ పేర్కొన్నారు. తనకు ఎవరినీ బాధపెట్టాలన్న ఆలోచన లేదని స్పష్టతనిచ్చారు. ఇతరుల మనసును నొప్పించే తత్త్వం తనది కాదనే విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసని, దురదృష్టవశాత్తూ ఆ వ్యాఖ్యలు అలవోకగా వచ్చాయని వివరణ ఇస్తూ ఆదివారం ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
దేవాంగులలో తనకు చాలామంది అభిమానులు ఉన్నారని బాలయ్య చెప్పారు. ‘నా వాళ్లను నేను బాధపెట్టుకుంటానా’ అంటూ తనను అర్థం చేసుకుంటారని, మీ సోదరుడి (బాలకృష్ణ) పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ.. దేవ బ్రాహ్మణుల గురువు దేవళ మహర్షి అని, వారి నాయకుడు రావణ బ్రహ్మ అని అన్నారు. దీనిపై ఆ వర్గానికి చెందిన జనం ఆగ్రహం వ్యక్తంచేశారు. బాలకృష్ణ చరిత్ర తెలియకుండా మాట్లాడారని మండిపడుతూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై వెనక్కి తగ్గిన బాలయ్య.. తనకు అందిన సమాచారం తప్పని తెలియజేసిన దేవబ్రాహ్మణ పెద్దలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు.