Hyderabad: హైదరాబాద్ ఎనిమిదో నిజాం కన్నుమూత
- టర్కీలోని ఇస్తాంబుల్ లో మృతి చెందిన ముకరంజా బహదూర్
- శనివారం రాత్రి తుది శ్వాస విడిచినట్టు హైదరాబాద్ లోని కార్యాలయం ప్రకటన
- ఆయన కోరిక మేరకు హైదరాబాద్ లో అంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడి
హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన నిజాం వంశంలో ఎనిమిదో నిజాం ముకరంజా బహదూర్ ఇకలేరు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. శనివారం రాత్రి 10.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు తెలిపింది. ఆయన కోరిక మేరకు అంత్యక్రియలను హైదరాబాద్‌లోని అసఫ్ జాహీ ఫ్యామిలీ టూంబ్స్‌లో నిర్వహించనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన షెడ్యూలును విడుదల చేస్తామని తెలిపింది.
బహదూర్ వయసు 89 సంవత్సరాలు. హైదరాబాద్ చిట్టచివరి నిజాం రాజు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్‌కు ఆయన మనుమడు. అలీ ఖాన్‌కు వారసుడిగా ఉన్నారు. ముకరంజా అసలు పేరు మిర్ బర్కత్ అలీ ఖాన్. మిర్ హిమాయత్ అలీ ఖాన్, డుర్రు షెవర్ దంపతుల కుమారుడైన ముకరంజా 1933 అక్టోబరు 6న జన్మించారు. డుర్రు షెవర్.. టర్కీ (ఒట్టోమన్ సామ్రాజ్యం) చిట్ట చివరి సుల్తాన్ కుమార్తె. ఆమె 20 ఏళ్ళ క్రితం మరణించారు. స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాద్ సంస్థాన్ భారత దేశంలో విలీనం అయిన తర్వాత నిజాం కుటుంబ సభ్యులు, వారసులు కొందరు విదేశాల్లో స్థిరపడ్డారు.