Virat Kohli: కోహ్లీ భారీ సెంచరీ... టీమిండియా 390-5

Kohli smashes ton against Sri Lanka

  • టీమిండియా, శ్రీలంక మూడో వన్డే
  • తిరువనంతపురంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • 110 బంతుల్లో 166 పరుగులు చేసిన కోహ్లీ
  • సెంచరీతో మెరిసిన గిల్

భారత బ్యాటింగ్ లోతెంతో మరోసారి శ్రీలంక బౌలర్లకు తెలిసొచ్చింది. మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ భారీ సెంచరీ, ఓపెనర్ శుభ్ మాన్ గిల్ సెంచరీ సాయంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసింది. 

కోహ్లీ తన క్లాస్, మాస్ ఆటను చూపిస్తూ లంక బౌలింగ్ ను ఊచకోత కోశాడు. 110 బంతుల్లో 166 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మాజీ కెప్టెన్ స్కోరులో 13 ఫోర్లు, 8 భారీ సిక్సులు ఉన్నాయి. తొలుత శుభ్ మాన్ గిల్ (116) సెంచరీ కొట్టగా, ఆ తర్వాత కోహ్లీ దెబ్బకు లంక బౌలర్లు మరింత బెంబేలెత్తిపోయారు. కోహ్లీని అవుట్ చేయలేక, భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 

కాగా, కోహ్లీకిది వన్డేల్లో 46వ సెంచరీ. శ్రీలంకతో తొలి వన్డేలోనూ కోహ్లీ సెంచరీ చేయడం తెలిసిందే. ఈ మూడు వన్డేల సిరీస్ లో కోహ్లీ 2 సెంచరీలతో అలరించాడు. కోహ్లీ మరో 3 సెంచరీలు చేస్తే సచిన్ టెండూల్కర్ (49 సెంచరీలు) రికార్డును సమం చేయనున్నాడు. 

ఇక, శ్రేయాస్ అయ్యర్ 38 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 7, సూర్యకుమార్ యాదవ్ 4 పరుగులకే అవుటయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ 42 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో కసున్ రజిత 2, లహిరు కుమార 2, చామిక కరుణరత్నే 1 వికెట్ తీశారు.

కాసేపు నిలిచిన ఆట...

ఈ మ్యాచ్ లో శ్రీలంక ఫీల్డర్ అషేన్ బండార తీవ్రంగా గాయపడ్డాడు. కరుణరత్నే బౌలింగ్ లో కోహ్లీ కొట్టిన షాట్ ను ఆపేందుకు లంక ఫీల్డర్లు బండార, వాండర్సే వేగంగా వచ్చారు. ఈ క్రమంలో ఇద్దరూ ఢీకొనడంతో బండార గాయపడ్డాడు. అతడిని స్ట్రెచర్ పై బయటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. అతడి మోకాలికి స్కానింగ్ తీయనున్నారు. అటు వాండర్సే కూడా గాయపడినా, అతడి పరిస్థితి ఫరవాలేదని తెలుస్తోంది. ఈ ఘటనతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది.

  • Loading...

More Telugu News