Budget 2023: మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చా.. వారి కష్టాలు నాకు తెలుసు: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
- ఇంతవరకు రూ.5లక్షల్లోపు ఆదాయం వారిపై ఎలాంటి పన్ను వేయలేదన్న మంత్రి
- మధ్యతరగతి వారి కోసమే మెట్రోల నిర్మాణం చేపడుతున్నట్టు ప్రకటన
- ఉచిత హామీల కోసం పార్టీలే నిధులు సమకూర్చుకోవాలన్న అభిప్రాయం
తాను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చానని, మధ్యతరగతి వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అర్థం చేసుకోగలనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కీలకమైన బడ్జెట్ కు ముందు పాంచజన్య మేగజీన్ నిర్వహించిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొని మాట్లాడారు. రూ.5 లక్షల్లోపు ఆదాయం పొందుతున్న వారిపై తమ సర్కారు ఒక్కసారి కూడా ఆదాయపన్ను రేట్లను పెంచలేదని, కొత్త పన్నును అమలు చేయలేదని చెప్పారు.
స్మార్ట్ సిటీల నిర్మాణం, సులభతర నివాసాన్ని ప్రోత్సహించడం, మెట్రో రైలు నెట్ వర్క్ లను నిర్మిస్తున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ప్రజా రవాణాను వాడుతుంటారని, 27 ప్రాంతాల్లో తమ ప్రభుత్వం మెట్రో రైలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీల కోసం అవి సొంతంగా నిధులు సమకూర్చుకోవాలన్నారు. 2014లో మోదీ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి ప్రపంచంలోని ఐదు బలహీన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా ఉందని.. గణనీయమైన మార్పులు చేపట్టడంతో ఇప్పుడు ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందినట్టు చెప్పారు.