cars: కార్ల ధరలను పెంచిన మారుతి సుజుకీ.. తక్షణమే అమల్లోకి!
- ప్రతీ కారుపై సగటున 1.1 శాతం పెంచుతున్నట్టు ప్రకటన
- అన్ని మోడళ్లపై పెంపు అమల్లోకి వస్తుందని చెప్పిన సంస్థ
- ప్రస్తుతం బడ్జెట్ కార్లలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న మారుతి
భారతదేశపు అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ వినియోగదారులకు షాకిచ్చింది. తమ కార్ల రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రతి కారుపై సగటున 1.1 శాతం పెంచుతున్నట్లు మారుతి సుజుకీ సోమవారం తెలిపింది. అన్ని మోడళ్ల కార్లకు ఇది వర్తిస్తుందని చెప్పింది. ధరల పెంపు ఈ రోజు నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన వ్యయం కారణంగా జనవరి నెలలో కార్ల ధరలను పెంచాల్సి ఉంటుందని మారుతి సుజుకీ గత నెలలో తెలిపింది.
ఈ క్రమంలో సోమవారం నుంచి అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచింది. ప్రస్తుతం భారత మార్కెట్ లో బడ్జెట్ కార్ల వినియోగంలో మారుతి ముందంజలో ఉంది. మధ్య స్థాయి ప్రీమియం కార్ల శ్రేణిలోనూ ఇతర సంస్థలకు మారుతి గట్టి పోటీనిస్తోంది. మారుతి కార్ల ధరలు పెరుగుదల మార్కెట్ పై ప్రభావం చూపనుంది. మారుతి బాటలో ఇతర కంపెనీలు కూడా ధరలను పెంచే అవకాశం కనిపిస్తోంది.