Harish Rao: ఖమ్మం వచ్చినప్పుడల్లా కొన్ని నేర్చుకుని పోతున్నా: మంత్రి హరీశ్ రావు
- ఖమ్మంలో ఈ నెల 18న బీఆర్ఎస్ సభ
- నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న హరీశ్ రావు
- ఖమ్మంలో నేడు బీఆర్ఎస్ నేతలతో సమావేశం
- పట్టణంలో రూ.1,200 కోట్లతో అభివృద్ధి జరిగిందని వెల్లడి
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలిసారిగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ జనవరి 18న జరగనుండగా, సభ ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నేడు ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పటి ఖమ్మంకు ఇప్పటి ఖమ్మంకు పోలికే లేదని అన్నారు. ఖమ్మంలో రూ.1,200 కోట్ల అభివృద్ధి జరిగిందని తెలిపారు. తాను ఖమ్మం వచ్చినప్పుడల్లా కొన్ని అంశాలు నేర్చుకుని పోతున్నానని వెల్లడించారు. లకారం చెరువు, డివైడర్, చెట్లు... ఇలా ఖమ్మంలో అనేక ప్రాంతాలను ఫొటోలు తీసుకుని ఇదే తరహాలో తన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకున్నట్టు హరీశ్ రావు వివరించారు.
ఇక రాజకీయాలపై స్పందిస్తూ, ఈసారి కాంగ్రెస్ పని ముగిసినట్టేనని, బీజేపీలో చేరితే ఆత్మహత్య చేసుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. మతతత్వ పార్టీలకు ఇక్కడ ఓట్లు పడతాయా? అని ప్రశ్నించారు. ముచ్చటగా మూడోసారి కూడా తమదే విజయం అని హరీశ్ ధీమా వ్యక్తం చేశారు.