Sri Lanka: టీమిండియా చేతిలో ఘోర పరాజయంపై శ్రీలంక క్రికెట్ బోర్డు ఆగ్రహం
- నిన్న తిరువనంతపురంలో భారత్ వర్సెస్ శ్రీలంక
- 317 పరుగుల తేడాతో ఓడిపోయిన శ్రీలంక
- వన్డే చరిత్రలో ఇదే అతిపెద్ద ఓటమి
- టీమ్ మేనేజ్ మెంట్ నుంచి వివరణ కోరిన లంక బోర్డు
- సెలెక్షన్ ప్యానెల్ పైనా అసంతృప్తి
టీమిండియాతో తిరువనంతపురంలో జరిగిన వన్డే మ్యాచ్ లో శ్రీలంక రికార్డు స్థాయిలో 317 పరుగుల తేడాతో ఓడిపోవడం తెలిసిందే. వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అత్యంత భారీ ఓటమి. పసికూన జట్లు కూడా ఇంత తేడాతో ఎప్పుడూ ఓడిపోలేదు.
ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జాతీయ జట్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇంత దారుణంగా ఓడిపోవడానికి గల కారణాలు ఏంటో చెప్పాలని టీమ్ మేనేజ్ మెంట్ ను ఆదేశించింది. కెప్టెన్ దసున్ షనక, కోచ్ క్రిస్ సిల్వర్ వుడ్, టీమ్ మేనేజర్ తో పాటు సెలెక్షన్ కమిటీ ప్యానెల్ ను కూడా బోర్డు వివరణ కోరింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలంటూ స్పష్టం చేసింది.
నిన్న తిరువనంతపురంలో టీమిండియా, శ్రీలంక మధ్య మూడో వన్డే జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసింది. కోహ్లీ (166 నాటౌట్), శుభ్ మాన్ గిల్ (116) సెంచరీలు నమోదు చేశారు.
అనంతరం, భారీ లక్ష్యఛేదనకు దిగిన లంకేయులు కేవలం 73 పరుగులకే ఆలౌట్ అయ్యారు. 22 ఓవర్లలోనే లంక ఇన్నింగ్స్ ముగిసింది. దాంతో భారత్ 317 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.