Ganga Vilas: తీరం చేరలేక నది మధ్యలోనే నిలిచిపోయిన గంగా విలాస్ క్రూయిజ్ నౌక
- వారణాసి నుంచి గంగా విలాస్ నౌకా యాత్ర
- 51 రోజుల పాటు యాత్ర
- చిరంద్ చారిత్రక స్థలాన్ని సందర్శించే క్రమంలో అవాంతరం
- ఒడ్డున తగినన్ని నీళ్లు లేకపోవడంతో నదిలోనే ఆగిపోయిన నౌక
- చిన్న పడవల్లో యాత్రికులను ఒడ్డుకు చేర్చిన అధికారులు
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి గంగా విలాస్ క్రూయిజ్ నౌకా విహారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 27 నదీ మార్గాల్లో 51 రోజుల పాటు దాదాపు 3,200 కిలోమీటర్ల మేర ఈ నౌకాయానం సాగనుంది. భారత్, బంగ్లాదేశ్ లోని వివిధ చారిత్రక స్థలాలు, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఈ గంగా విలాస్ నౌక ముందుకు సాగనుంది. అయితే, బీహార్ లోని చాప్రా వద్ద ప్రతికూల పరిస్థితుల్లో ఈ నౌక నిలిచిపోయింది.
చారిత్రక ప్రదేశం చిరంద్ ను దర్శించడం కోసం ఈ నౌక డోరిగంజ్ వెళ్లేందుకు ప్రయాణిస్తోంది. అయితే తీరం చేరుకునే క్రమంలో తగినంత నీటిమట్టం లేకపోవడంతో నదిలోనే నిలిచిపోయింది. దాంతో, అందులోని యాత్రికులను చిన్న పడవల్లో తీరానికి చేర్చారు. ఇక్కడి ఒడ్డున నీరు తక్కువగా ఉండడం వల్ల గంగా విలాస్ క్రూయిజ్ నౌకను తీరం వరకు తీసుకురావడం కష్టమని అధికారులు వెల్లడించారు.
కాగా, నది మధ్యలోనే నిలిచిపోయిన ఈ విలాసవంతమైన భారీ నౌకను చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.