Team India: నేడు టీమిండియా, న్యూజిలాండ్ జట్లు సాధనలో బిజీబిజీ!
- మధ్నాహ్నం ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేయనున్న కివీస్
- రాత్రి ఫ్లడ్ లైట్స్ వెలుతురులో టీమిండియా సాధన
- రేపు ఇరు జట్ల మధ్య మొదటి వన్డే
హైదరాబాద్ లో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ సందడి మొదలైంది. గత సెప్టెంబర్ లో భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 అభిమానులను ఎంతగానో అలరించింది. ఇప్పుడు భాగ్యనగర అభిమానులకు వన్డే మ్యాచ్ రుచి చూపించేందుకు భారత్, న్యూజిలాండ్ జట్లు వచ్చాయి. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా బుధవారం ఉప్పల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. ఇందుకోసం న్యూజిలాండ్ క్రికెటర్లు శనివారమే నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. శ్రీలంకతో ఆదివారం మూడో వన్డేలో గెలిచిన తర్వాత టీమిండియా నిన్నరాత్రి వచ్చింది. కివీస్ జట్టు సోమవారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేసింది.
మ్యాచ్ కు మరో రోజు మాత్రమే ఉంటడంతో ఇరు జట్లూ ఈ రోజు బిజీబిజీగా గడపనున్నాయి. ఉప్పల్ స్టేడియంలో భారత్, కివీస్ సాధన (ప్రాక్టీస్) లో పాల్గొంటాయి. తొలుత న్యూజిలాండ్ జట్టు మధ్యాహ్నం 1 నుంచి 4 వరకు ప్రాక్టీస్ చేయనుంది. ప్రాక్టీస్ తర్వాత ఆ జట్టు కెప్టెన్ టామ్ లాథమ్ మీడియాతో మాట్లాడుతాడు. ఆపై, భారత జట్టు 5 నుంచి 8 వరకు ఫ్లడ్ లైట్స్ వెలుతురులో ప్రాక్టీస్ లో పాల్గొంటుంది. ప్రాక్టీస్ ముందే కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ లో ఒకరు మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం 1.30 నుంచి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది.