nails: చేతి గోళ్లపై తెల్లటి మచ్చలున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..!
- జింక్ లోపం వల్ల అలాంటి మచ్చలు ఏర్పడతాయి
- క్యాల్షియం లోపం వల్ల అన్నది అపోహ మాత్రమే
- జింక్ లోపిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలకు అవకాశం
మీ చేతి వేళ్ల గోళ్లను ఒక్కసారి పరిశీలించుకోండి. తెల్లటి మచ్చలు లేదా అడ్డగీతలు కనిపిస్తున్నాయా..? అయితే అలా ఎందుకన్నది తెలుసుకోవాల్సిందే. క్యాల్షియం లోపం వల్ల గోళ్లపై ఇలాంటి మచ్చలు ఏర్పడతాయన్న అపోహ ఒకటి జనబాహుళ్యంలో ఉంది. కానీ అందులో నిజం లేదు. జింక్ లోపం ఉంటే అలా గోళ్లపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఇలాంటి తెల్లటి మచ్చలున్న వారు తమ ఆహారంలో జింక్ ఉన్న వాటిని తీసుకోవాలి. లేదంటే వైద్యుల సలహాతో జింక్ సప్లిమెంట్లను తీసుకోవచ్చు.
అశ్రద్ధ వద్దు..
జింక్ లోపాన్ని విస్మరించడానికి లేదు. ఎందుకంటే గుండె, ఎముకలు, ఊపిరితిత్తులు, వందలాది ఎంజైమ్ ల ఉత్పత్తికి జింక్ అవసరం. రోజుకు అవసరమైన మోతాదు కంటే ఎక్కువ జింక్ ను మన శరీరం నిలిపి ఉంచుకోలేదు. అధికంగా ఉన్న మొత్తాన్ని మూత్రం ద్వారా బయటకు పంపించేస్తుంది. అందుకని నిత్యం ఆహారం రూపంలో జింక్ అందే విధంగా చర్యలు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఐరన్ మాదిరే, జింక్ కూడా మన శరీరానికి అత్యవసరమైనది. ప్రొటీన్ ఉత్పత్తి, కణాల వృద్ధి, డీఎన్ఏ సింథసిస్, వ్యాధి నిరోధక శక్తి, ఎంజైమ్ రియాక్షన్లకు జింక్ చాలా అవసరం. అందుకే దీన్ని మిరాకిల్ మినరల్ గా పిలుస్తారు. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను జింక్ చక్కగా నయం చేస్తుందని డాక్టర్ పూజ మఖిజా అంటున్నారు. మన దేశంలో 73 శాతం మంది ప్రజల్లో జింక్ లోపం ఉన్నట్టు ఆమె చెప్పారు.
మన కణాల్లో ఉండే జింక్ ను రక్త పరీక్షల్లో కచ్చితంగా నిర్ధారించడం కష్టమని ముఖిజా అంటున్నారు. జింక్ లోపానికి కొన్ని సంకేతాలను ఆమె తెలియజేశారు. ఎక్కువ సేపు చక్కని నిద్ర పోలేకపోతున్నారా? వ్యాధి నిరోధక శక్తి బలహీనంగా ఉందా? లైంగిక కోర్కెలు అంతగా ఉండడం లేదా? బరువు పెరిగిపోతున్నారా? దంతాల్లో పుచ్చు, చిగుళ్ల సమస్యలు కనిపిస్తున్నాయా? చేతులు, ముఖం చర్మంపై ముడతలు కనిపిస్తున్నాయా? గాయాలు మానడం ఆలస్యమవుతోందా? ఇవన్నీ జింక్ లోపం వల్ల కనిపించేవే.
వీటిల్లో జింక్
పుట్టగొడుగులు, పాలకూర, బ్రొకోలీ, వెల్లుల్లి, బీన్స్, చిక్ పీస్, నట్స్, గుమ్మడి గింజలు, బ్రౌన్ రైజ్, ఓట్స్, క్వినోవా, కార్న్ ఫ్లేక్స్, పాల ఉత్పత్తులు, డార్క్ చాక్లెట్లు, చికెన్, మటన్, పీతల్లో జింక్ లభిస్తుంది.
జింక్ సప్లిమెంట్లు
వైద్యుల సూచనతో జింక్ సప్లిమెంట్ తీసుకోవచ్చు. జింక్ గ్లూకోనేట్, జింక్ సల్ఫేట్, జింక్ సిట్రేట్ ఇలా పలు రూపాల్లో సప్లిమెంట్లు లభిస్తాయి.
దుష్ప్రభావాలు
జింక్ మోతాదుకు మించి తీసుకోకూడదు. రోజులో 40 మిల్లీ గ్రాములు మించకుండా చూసుకోవాలి. అధికం అయితే తల తిరగడం, వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి రావచ్చని వైద్యులు అంటున్నారు. అంతేకాదు ఫ్లూ లక్షణాలతో జ్వరం, దగ్గు, తలనొప్పి కనిపిస్తాయి. యాంటీబయాటిక్స్ తో కలిపి తీసుకోకూడదు. యాంటీబయాటిక్ సామర్థ్యాన్ని జింక్ తగ్గిస్తుంది. రోజులో 40 ఎంజీ మించకుండా చూసుకోవాలి.