Nizam: హైదరాబాదుకు చేరుకున్న ఎనిమిదో నిజాం ముకర్రమ్ జా పార్థివదేహం
- ఇస్తాంబుల్ లో కన్నుమూసిన చివరి నిజాం ముకర్రమ్ ఝా
- ఆయన భౌతికకాయాన్ని దర్శించుకున్న నిజాం కుటుంబీకులు, బంధువులు
- రేపు మక్కా మసీదులో పూర్వీకుల సమాధుల పక్కన ఖననం
ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు, ఎనిమిదో నిజాం ప్రిన్స్ మీర్ అలీఖాన్ ముకర్రమ్ జా బహదూర్ టర్కీలోని ఇస్తాంబుల్ లో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు మన దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న ముకర్రమ్ జా ఇస్తాంబుల్ లో ఒక అద్దె ఇంట్లో మృతి చెందడం బాధాకరం. మరోవైపు ఆయన మృతదేహం టర్కీ నుంచి హైదరాబాద్ కు చేరుకుంది. ఇస్తాంబుల్ నుంచి ఆయన భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. అక్కడి నుంచి చౌమొహల్లా ప్యాలెస్ కు తరలించారు.
ఈరోజు ఆయన భౌతికకాయాన్ని చూడటానికి కేవలం నిజాం కుటుంబీకులు, బంధువులకు మాత్రమే అనుమతిని ఇచ్చారు. రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయన పార్థివదేహాన్ని చూసేందుకు ప్రజలకు అనుమతిని ఇస్తారు. రేపు మధ్యాహ్నం ముకర్రమ్ అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. చార్మినార్ పక్కన ఉన్న మక్కా మసీదు వరకు అంతిమ యాత్ర కొనసాగుతుంది. అక్కడున్న ఆయన పూర్వీకులైన నిజాం (అసఫ్ జాహీలు)ల సమాధుల పక్కనే ముకర్రమ్ పార్థివ దేహాన్ని ఖననం చేస్తారు. శనివారం రాత్రి 89 ఏళ్ల ముకర్రమ్ ఝా ఇస్తాంబుల్ లో కన్నుమూశారు.