Raghunandan Rao: రూ. 4 వేల కోట్ల విలువైన భూములను తోట చంద్రశేఖర్ కు కేసీఆర్ అప్పగించారు: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణలు
- మియాపూర్ లోని భూములను అప్పగించారన్న రఘునందన్ రావు
- సోమేశ్ కుమార్ కనుసన్నల్లో కుంభకోణం జరుగుతోందని ఆరోపణ
- ఖమ్మం సభకు ఇన్ని నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్న
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కు మియాపూర్ లోని రూ. 4 వేల కోట్ల విలువైన భూములను కేసీఆర్ అప్పగించారని అన్నారు. తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కనుసన్నల్లో ఈ భారీ భూకుంభకోణం జరుగుతోందని... ఇందులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పాత్ర కూడా ఉందని చెప్పారు. సర్వే నెంబర్ 78లో 40 ఎకరాల భూములను తోట చంద్రశేఖర్ కు చెందిన ఆదిత్య కన్స్ స్ట్రక్షన్స్ కు కేటాయించారని తెలిపారు.
బీహార్ నుంచి వచ్చిన అధికారులంటే కేసీఆర్ కు చాలా ఇష్టమని... అందుకే బీహార్ వ్యక్తిని డీజీపీగా నియమించారని చెప్పారు. రేపటి ఖమ్మం బీఆర్ఎస్ సభకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. గతంలో ఆంధ్ర ప్రజలను దొంగలని కేసీఆర్ అన్నారని... ఇప్పుడు ఆంధ్ర వాళ్లు ఆయనకు బంధుమిత్రులుగా మారిపోయారని అన్నారు.