Andhra Pradesh: ‘దావోస్’కు ఆహ్వానం అందలేదన్నది దుష్ప్రచారమే: గుడివాడ అమర్‌నాథ్
- గతేడాది నవంబరు 25నే ఆహ్వానం అందిందన్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్
- మార్చిలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సు నిర్వహిస్తున్నట్టు వెల్లడి
- ఆ ఏర్పాట్లలో బిజీగా ఉండడం వల్లే జగన్ వెళ్లలేకపోయారని వివరణ
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ఏపీ ప్రభుత్వానికి ఆహ్వానం అందలేదంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. వాటిలో నిజం లేదని, అదంతా దుష్ప్రచారమేనని అన్నారు. విశాఖపట్టణంలోని గవర్నర్ బంగ్లాలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరుకావాలంటూ గతేడాది నవంబరు 25నే సీఎంకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానాలు అందినట్టు చెబుతూ ఆ లేఖలను మీడియాకు చూపించారు.
ఈ ఏడాది మార్చిలో విశాఖపట్టణంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సుకు ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించాలని జగన్ నిర్ణయించారని, ఆ ఏర్పాట్లలో ఆయన బిజీగా ఉండడం వల్లే దావోస్ వెళ్లలేదని వివరించారు. ఇంతకుముందు దావోస్ వెళ్లి ఎంతో సాధించానని చెప్పుకుంటున్న చంద్రబాబును ఆ వేదికపై ప్రసంగించాలని ఏనాడైనా అక్కడి నిర్వాహకులు ఆహ్వానించారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఏడాదికి రూ. 11 వేల కోట్ల పెట్టుబడులు వస్తే జగన్ పాలనలో రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్టు మంత్రి అమర్‌నాథ్ చెప్పారు.