modi: సినిమాలపై అనవసర వ్యాఖ్యలు చేయొద్దు: మోదీ
- బీజేపీ నేతలకు సూచించిన ప్రధాని
- పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సూచన
- పఠాన్ సినిమాపై నిషేధం నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు
సినిమాలపై నాయకులు చేసే కామెంట్లను మీడియా హైలైట్ చేస్తోందని, టీవీలు రోజంతా ప్రసారం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పేర్కొన్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. ఈమేరకు ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న మోదీ.. మంగళవారం పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. అనవసర వ్యాఖ్యలు చేసి ప్రచారంలో ఉండొద్దని హితవు పలికారు.
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణే నటించిన పఠాన్ సినిమాపై వివాదం రేగడం తెలిసిందే! ఈ సినిమా ప్రదర్శనను నిషేధించాలని పలువురు నాయకులు, ఇతర సంఘాలు పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. ఈ సినిమాలో హీరోయిన్ కాషాయ రంగు దుస్తులు ధరించడంపై బీజేపీ నేతలు పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా వంటి నేతలు చేసిన వ్యాఖ్యలను మీడియా హైలైట్ చేసింది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తాజాగా పార్టీ నేతలకు సూచనలు చేసినట్లు సమాచారం.