Bandi Sanjay: బండి సంజయ్ కుమారుడి మరో వీడియో వైరల్.. చర్యలు తీసుకున్న యూనివర్సిటీ!
- తోటి విద్యార్థిని కొట్టిన బండి భగీరథ్
- స్నేహితుడి చెల్లెలిని ఇబ్బంది పెట్టినందుకే బుద్ధి చెప్పాడని బాధితుడి వివరణ
- మరో వ్యక్తిని భగీరథ్ కొడుతున్న వీడియో వెలుగులోకి
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన రెండు వీడియోలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. హైదరాబాద్ లోని మహీంద్ర యూనివర్సిటీలో చదువుతున్న బండి సాయి భగీరథ్ వివాదంలో చిక్కుకున్నారు. తోటి విద్యార్థిపై దాడి చేసి, చేయి చేసుకున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ముందుగా ఓ వ్యక్తిపై భగీరథ్, అతని స్నేహితుడు చేయి చేసుకోవడమే కాకుండా రాయలేని భాషలో తిడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైనట్టు తెలుస్తోంది.
అయితే, భగీరథ్ చేతిలో దెబ్బలు తిన్న వ్యక్తి దీనిపై వివరణ ఇచ్చాడు. ఇది పాత వీడియో అని, స్నేహితుడి సోదరిని ప్రేమించాలంటూ ఇబ్బంది పెట్టడంతోనే భగీరథ్ తనను కొట్టాడని చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు. తామిద్దరం ఇప్పుడు కలిసిపోయామని, కొందరు కావాలనే పాత వీడియోను వైరల్ చేస్తున్నారని చెప్పాడు. కానీ, భగీరథ్ అతని స్నేహితుల బృందం మరో విద్యార్థిని కొడుతున్న ఇంకో వీడియో నెట్ లో వైరల్ అయ్యింది. దాంతో, భగీరథ్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తండ్రి అండ చూసుకునే ఇలా రెచ్చిపోతున్న భగీరథ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో భగీరథ్ ను మహీంద్ర యూనివర్సిటీ సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది.