Intermittent Fasting: ఈ వ్యాధులుంటే.. ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ పనికిరాదు

Weight Loss Diet People With These Health Conditions Should Avoid Intermittent Fasting

  • హార్మోన్ల సమస్యలు, మధుమేహం ఉన్నవారు చేయకూడదు
  • థైరాయిడ్ సమస్యలు, మెనోపాజ్ లోని వారికి సూచనీయం కాదు
  • ఈటింగ్ డిజార్డర్లు ఉన్నవారు అసలే ట్రై చేయవద్దంటున్న నిపుణులు

ఆరోగ్యం పట్ల నేడు ప్రజల్లో శ్రద్ధ పెరిగింది. పెరిగిన స్మార్ట్ ఫోన్ల వినియోగం ఫలితంగా, ఎంతో సమాచారం నేడు అందుబాటులోకి రావడాన్ని ఇందుకు కారణంగా చెప్పుకోవాలి. దీంతో ప్రజలు ఏది కావాలన్నా నెట్ లో సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు. వైద్యుల సలహా లేకుండానే నెట్ లో సమాచారం ఆధారంగా కొన్ని పాటించేస్తున్నారు కూడా. కానీ, ఆరోగ్యం విషయంలో ఏది చేసినా, ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఎంతో ముఖ్యమని గుర్తించాలి. 

ముఖ్యంగా బరువు తగ్గేందుకు, చర్మ సౌందర్యం కోసం నెట్ లో అన్వేషించే వారే ఎక్కువ. బరువు తగ్గాలని భావించే వారికి నేడు ఎంతో ప్రచారంలోకి వచ్చిన విధానం ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్. అంటే.. నిర్ణీత వేళల్లోనే ఆహారం తీసుకుంటూ, మిగిలిన సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండడాన్ని ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ గా చెబుతారు. ఉదాహరణకు ఎక్కువగా పాప్యులర్ అయినది 16 గంటల ఫాస్టింగ్. అంటే రాత్రి 8 గంటలకు తినేసి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఏమీ తినకుండా ఉండడం. అంటే ఏది తిన్నా మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8లోపే తినేయాలి. ప్రతి విధానంలోనూ మంచి చెడులు ఉంటుంటాయి. అలా అని ఒక విధానం అందరికీ సరిపోతుందని భావించరాదు. అదే మాదిరి ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ సైతం అందరికీ అనుకూలం అనుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. 

కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటర్ మిటెంట్ తో బరువు తగ్గే విషయంలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని ప్రతి ఒక్కరూ తమంతట తాము ఈ పద్ధతిని పాటించకుండా.. ముందు డాక్టర్ ను కలసి సలహా తీసుకోవాలని డాక్టర్ విశాఖ సూచిస్తున్నారు. దీనిపై ఇన్ స్టా గ్రామ్ లో ఆమె ఓ వీడియోను పోస్ట్ చేశారు.

సరైన విధంగా చేస్తే ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ అద్భుత ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు. కాకపోతే అందరికీ ఇది అనుకూలం కాదన్నది ఆమె సూచన. ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ తో హార్మోన్లలో మార్పులు వస్తాయి. దీంతో మంచి కంటే నష్టమే ఎక్కువని డాక్టర్ విశాఖ అంటున్నారు. మధుమేహం, పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (పీసీవోఎస్), థైరాయిడ్ సమస్యలు, ముందస్తుగా మెనోపాజ్ దశలోకి అడుగు పెట్టిన మహిళలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ కు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే అతిగా తినే బులూమియా, లేదంటే కడుపు మాడ్చుకునే అనొరెక్సియా తదితర ఈటింగ్ డిజార్డర్లు ఉన్నవారు అసలే దీన్ని ట్రై చేయవద్దని పేర్కొన్నారు. ఇక ఆరోగ్యవంతులు సైతం వారంలో కేవలం ఐదు రోజుల పాటే ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ చేయాలన్నది డాక్టర్ విశాఖ సూచన.

  • Loading...

More Telugu News