ias ips officers: తెలుగు రాష్ట్రాల మధ్య ఐఏఎస్, ఐపీఎస్ ల కేటాయింపుపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా
- అన్ని పిటిషన్లపై రెగ్యులర్ బెంచ్ విచారణ జరుపుతుందన్న హైకోర్టు సీజే
- వ్యక్తిగత వాదనలు వినిపిస్తామని చెప్పిన అధికారుల తరపు న్యాయవాదులు
- ఈ నెల 27కు విచారణ వాయిదా వేసిన కోర్టు
- గతంలో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులతో తెలంగాణలో పని చేస్తున్న ఏపీ క్యాడర్ ఆఫీసర్లు
- ఇటీవల ఇలాంటి కేసులోనే హైకోర్టు తీర్పుతో ఏపీలో రిపోర్టు చేసిన సోమేశ్ కుమార్
తెలంగాణ ఇన్ చార్జ్ డీజీపీ అంజనీకుమార్ సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపులపై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. 12 మంది బ్యూరోక్రాట్ల క్యాడర్ పై వేసిన పిటిషన్ ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది.
ట్రైబ్యునల్ వేర్వేరుగా తీర్పులు వెలువరించిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అభిప్రాయపడ్డారు. అన్ని పిటిషన్లపై రెగ్యులర్ బెంచ్ విచారణ జరుపుతుందని సూచించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత వాదనలు వినిపిస్తామని అధికారుల తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. దీంతో తదుపరి విచారణను ఈనెల 27కు హైకోర్టు వాయిదా వేసింది.
ఏపీ క్యాడర్‌కు చెందిన 12 మంది ఆలిండియా సర్వీస్ ఆఫీసర్లు క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణలో పని చేస్తున్నారు. వీరిలో తెలంగాణ ఇన్ చార్జ్ డీజీపీ అంజనీకుమార్, ఎడ్యుకేషన్ సెక్రటరీ వాకాటి కరుణ, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ రొనాల్డ్ రాస్ తదితరులు ఉన్నారు.
ఏపీ క్యాడర్ కు చెందిన సోమేశ్ కుమార్ మొన్నటిదాకా తెలంగాణ సీఎస్ గా పని చేశారు. అయితే క్యాడర్ విషయంలో వారం కిందట హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడం.. అందుకు అనుగుణంగా డీవోపీటీ ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణలో సీఎస్ పోస్టును వదులుకుని.. రెండు రోజుల వ్యవధిలోనే ఏపీలో సోమేశ్ కుమార్ రిపోర్ట్ చేశారు.