diabetes: మధుమేహులూ.. ఈ రెండు ఔషధాలతో తీవ్ర దుష్ప్రభావాలు
- గాబా పెంటిన్, ప్రగాబాలిన్ పై అమెరికాలో అధ్యయనం
- వీటిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల శరీరంలో పెరిగిపోయే నీటి పరిమాణం
- దీంతో గుండె జబ్బుల రిస్క్ ఉంటుందన్న పరిశీలన
డయాబెటిక్ న్యూరోపతి బాధితులకు ఉపశమనం కోసం వైద్యులు సూచించే రెండు అతి ముఖ్యమైన ఔషధాలు.. గాబాపెంటిన్, ప్రగాబాలిన్ తో తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయన్న అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీర్ఘకాలం పాటు మధుమేహం నియంత్రణలో లేని వారిలో నరాలు దెబ్బతింటాయి. ఈ పరిస్థితిని డయాబెటిక్ న్యూరోపతిగా చెబుతారు. నరాలు దెబ్బతినడం వల్ల ఆయా భాగాల్లో నొప్పులు వేధిస్తాయి. ఈ ఔషధాలు తీసుకోవడం వల్ల ఆ నొప్పి తెలియకుండా ఉపశమనం కలుగుతుంది. మన దేశంలో పెద్ద ఎత్తున ఈ రెండు ఔషధాల వినియోగం జరుగుతుంది. ఏ స్థాయిలో అంటే ఈ రెండు ఔషధాల మార్కెట్ విలువ రూ.2,000 కోట్లు.
గాబాపెంటిన్, ప్రగాబాలిన్ శరీరంలో నీటి నిల్వలు అధిక మోతాదులో నిలిచిపోయేందుకు దారితీసి, గుండె జబ్బులకు కారణమవుతున్నట్టు అమెరికాలో జరిగిన ఓ అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనం ఫలితాలు కార్డియోవాస్క్యులర్ డయాబెటాలజీ అనే జర్నల్ లో ప్రచురితమయ్యాయి. దీనిపై యూఎస్ ఎఫ్ డీఏ ఇప్పటికీ స్పందించలేదు. మధుమేహం రోగుల పరంగా ప్రపంచంలో మన దేశం రెండో స్థానంలో ఉన్నందున ఇక్కడి నిపుణులు దీనిపై విస్తృత పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం తాజా పరిణామంతో ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఫార్మకోవిజిలెన్స్ చేపట్టి, ఈ ఔషధాలతో వచ్చే ముప్పును తేల్చాలని వైద్య నిపుణులు కూడా కోరుతున్నారు.
‘‘డయాబెటిక్ న్యూరోపతి సమస్యతో బాధపడుతూ గాబాపెంటిన్, ప్రగాబాలిన్ వాడుతున్న వారిలో హార్ట్ ఫెయిల్యూర్, మయోకార్డియల్ ఇన్ ఫ్రాక్షన్, పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్, స్ట్రోక్, డీప్ వీన్ థ్రోంబోసిస్, పల్మనరీ ఎంబాలిజం రిస్క్ దీర్ఘకాలంలో పెరుగుతోంది’’ అని ఈ అధ్యయనం పేర్కొంది. గాబాపెంటిన్, ప్రగాబాలిన్ ను సూచించే ముందు రిస్క్ ను పరిగణనలోకి తీసుకోవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ఈ రెండు ఔషధాలు చాలా ఏళ్లుగా మన దేశంలో వినియోగంలో ఉన్నవే. వీటికి మెరుగైన ప్రత్యామ్నాయ ఔషధాలు ఏవీ లేవు. అందుకే వైద్యులు వీటిని సూచిస్తుంటారు. కనుక వీటి విషయంలో సమగ్ర సమీక్ష అవసరమన్న అభిప్రాయం వైద్య నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. నరాలు దెబ్బతినడం, వెన్నెముకలో నరాలు కంప్రెస్ అవుతూ నొప్పితో బాధపడుతున్న వారికి కూడా ఈ ఔషధాలను వైద్యులు సిఫారసు చేస్తుంటారు. అయితే, ఈ ఔషధాలను మూడు నెలలకు మించి వాడకపోవడం మంచిదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.