Nagababu: చరిత్రలో మొదటిసారి ఉద్యోగ సంఘాలు గవర్నర్ కు ఫిర్యాదు చేశాయి: నాగబాబు
- నిన్న ఏపీ గవర్నర్ ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు
- బకాయిల చెల్లింపులపై గవర్నర్ కు ఫిర్యాదు
- మరోమార్గం లేక ఉద్యోగులు గవర్నర్ ను కలిశారన్న నాగబాబు
- వైసీపీ అసమర్థ పాలనకు ఇదే నిదర్శనం అని విమర్శలు
ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు నిన్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి వైసీపీ సర్కారుపై ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం చెల్లించడంలేదంటూ గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు. దీనిపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు స్పందించారు.
ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. డీఏ, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, రిటైర్మెంట్ ప్రయోజనాలు అందక, ఆందోళన చేయడానికి అనుమతి దొరకని పరిస్థితుల్లో ఉద్యోగులు గవర్నర్ ను కలిశారని వివరించారు. ఆర్టికల్ 309 ప్రకారం ఉద్యోగ వ్యవస్థపై ప్రత్యక్ష సంబంధాలు, అధికారాలు కలిగివున్న గవర్నర్ కు మొరపెట్టుకునే స్థితికి ఉద్యోగులను తీసుకొచ్చారని నాగబాబు విమర్శించారు. వైసీపీ అసమర్థ పరిపాలనకు ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేం కావాలి? అని ప్రశ్నించారు.
కాగా, ఈ నెల 21, 22 తేదీల్లో నాగబాబు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 21న కర్నూలు జిల్లా వీరమహిళల సభలో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం జనసైనికుల సభకు హాజరవుతారు. ఈ నెల 22న అనంతపురం జిల్లాలో వీరమహిళలు, జనసైనికుల సభల్లో పాల్గొంటారు.