Chandrababu: జీవో నెం.1పై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పడం ప్రభుత్వానికి చెంపపెట్టు: చంద్రబాబు
- ఇటీవల జీవో నెం.1ను తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
- జీవోను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన హైకోర్టు
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన సర్కారు
- హైకోర్టులో విచారణ ఉండగా సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారన్న చంద్రబాబు
ఇటీవల తీసుకువచ్చిన జీవో నెం.1పై ఏపీ హైకోర్టు సస్పెన్షన్ ఆర్డర్స్ ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జీవో నెం.1పై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
జీవో నెం.1పై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పడం ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని పేర్కొన్నారు. హైకోర్టులో విచారణ ఉండగా, సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారని చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సైకో తరహా నిర్ణయాలతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. జీవో నెం.1ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రోడ్లపై సభలు, సమావేశాలు, రోడ్ షోలకు సంబంధించిన అనుమతులపై ప్రభుత్వం జీవో నెం.1 తీసుకురాగా, ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించగా, జీవో నెం.1ను హైకోర్టు ఈ నెల 23 వరకు సస్పెండ్ చేసింది. అదే రోజున హైకోర్టులో తదుపరి విచారణ జరగనుంది. ఈలోపే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది.